
విజయవాడ సింగ్‌నగర్‌లో ఘటన
విడాకులతో వేరుపడిన తల్లిదండ్రులు
కేన్సర్ బారిన పడిన తల్లి.. మతిస్థిమితం లేని చెల్లి
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): విడిపోయిన తల్లిదండ్రులు.. కేన్సర్ బారిన పడిన తల్లి.. మతిస్థిమితం లేని చెల్లి.. ఓ పక్క ఇంటి బాధ్యతలు.. మరోపక్క చదువు.. ఇంతలో ఆ విద్యార్థికి ఏమైందో తెలియదు. ఇంటివద్ద బాత్‌రూమ్‌లో టవల్‌తో ఉరివేసుకున్న స్థితిలో అతడి మృతదేహం లభ్యమైంది. విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ (15) అనుమానాస్పద స్థితిలో మృత్యువాతపడ్డాడు. సింగ్‌నగర్ డాబాకొట్లు సెంటర్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయం ఎదురు రోడ్డులో ఉంటున్న కనికే రాజ్యలక్ష్మి, శ్రీనివాసులు దంపతులు విభేదాల కారణంగా ఏడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు.
వీరికి కుమారుడు యశ్వంత్, కుమార్తె (13) సంతానం. సింగ్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో యశ్వంత్ 9వ తరగతి చదువుతుండగా.. కుమార్తె పుట్టిన దగ్గర నుంచి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. రాజ్యలక్ష్మి ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల ఆమె కేన్సర్ బారినపడి 2 నెలల నుంచి ఇంట్లోనే వైద్యం చేయించుకుంటోంది. యశ్వంత్ వారం నుంచి పాఠశాలకు సరిగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి హాలులో చదువుకుంటుండగా.. తల్లి పక్కనే నిద్రపోయింది.
గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె నిద్రలేచి చూడగా యశ్వంత్ కనిపించలేదు. బెడ్‌రూమ్‌లో లేకపోవడంతో బాత్‌రూమ్ దగ్గరకు వెళ్లిచూడగా లోపల తలుపువేసి ఉంది. ఎంత పిలిచినా పలక్కపోవడంతో అనుమానం వచ్చిన ఆమె చుట్టుపక్కల వారిని పిలిచింది. తలుపులు పగులకొట్టి చూడగా బాత్‌రూమ్ డోర్‌కు టవల్‌తో మెడకు ఉరేసుకున్న స్థితిలో యశ్వంత్ కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని యశ్వంత్‌ను హాస్పటల్‌కు తరలించినా ఫలితం లేకపోయింది.
కుటుంబ పరిస్థితులను చూసి యశ్వంత్ కలవరపడినట్టు తెలుస్తోంది. యశ్వంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్‌రూమ్ డోర్‌కు ఉన్న హ్యాండిల్ కేవలం రెండు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. యశ్వంత్ ఎత్తు సుమారు ఐదు అడుగులు. ఇంత ఎత్తు ఉన్న వ్యక్తి ఆ రెండగుల ఎత్తులో ఉన్న హ్యాండిల్‌కు ఎలా ఉరివేసుకొని చనిపోతాడని పోలీసులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యశ్వంత్ నేల మీద కూర్చున్నా కూడా ఆ డోర్ హ్యాండిల్ తేలిగ్గా అందుతుందని ఈ ఎత్తులో ఉరి వేసుకోవడం అసాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
యశ్వంత్‌ను ఎవరైనా చంపేసి అలా కండువాతో కట్టేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా.. వారి కుటుంబ సభ్యులు ఇంకా ఎవరెవరు ఉన్నారు.. వారితో ఎవరికైనా గొడవలు, ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా.. ప్రేమ వ్యవహారం లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహాలతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేన్సర్ బారిన పడిన తన తల్లి కూడా చనిపోతుందని భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.