కాలినడకన తిరుమలకు వీధి కుక్క,  620 కిలోమీర్లు నడిచి..

Street Dog Climb Tirumala Hills With Two Devotees On Foots - Sakshi

ఇద్దరు భక్తులతోపాటు 620 కిలోమీటర్లు నడిచిన వీధి కుక్క 

సాక్షి, తాడేపల్లిగూడెం: పాలు పోశారన్న విశ్వాసంతో ఓ శునకం ఇద్దరు భక్తులతో జంగారెడ్డిగూడెం నుంచి తిరుపతికి 620 కిలోమీటర్లు కాలినడకన తోడు వెళ్లింది. వివరాలు ఇవి.. జంగారెడ్డిగూడెంకు చెందిన ముడి ప్రతాపరెడ్డి, అతని స్నేహితుడు పైడి రవి మార్చి 15న కాలినడకన తిరుమల బయలుదేరారు. ప్రతాపరెడ్డి కాలినడకన వెళ్లడం ఇది మూడోసారి కాగా, పైడి రవికి రెండోసారి. ఈ సారి వెళ్లేటప్పుడు ఎవరైనా భక్తులు వస్తే ఖర్చులు తామే పెట్టుకుని కాలినడకన తీసుకెళదామనుకున్నారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. మార్చి 15న వీరు జంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరారు.

జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయ సమీపానికి చేరుకునేసరికి వీరికి రెండు శునకాలు కలిశాయి. వాటిని వీరు అదిలించినప్పటికీ వీరి వెంటే వచ్చాయి. కొద్ది దూరం వెళ్లాక ఒక శునకం వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఒకటి మాత్రం పూర్తిగా వీరివెంటే నడిచింది. దీంతో దానికి పాలుపోసి, వీరు తినే ఆహార పదార్థాలు పెడుతుండేవారు.  శునకం వీరికంటే ముందు నడుస్తూ ఉండేది. ఇలా 620 కిలోమీటర్లు వీరితో పాటు నడిచింది. మార్గ మధ్యంలో దీనికి నంది అని పేరు పెట్టారు. మార్చి 29న వీరు తిరుమల చేరుకున్నారు. మెట్ల దారిగుండా వెళుతుండగా, శునకాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించి కొండపైకి తీసుకెళ్లకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతాపరెడ్డి పెదనాన్న కుమార్తె టీటీడీలో పనిచేస్తున్నారు. వారికి ఫోన్‌ చేసి ఈ కుక్కను కొండ దిగువన ఉన్న వారింటికి చేర్చారు. రెండు రోజులు ఆ ఇంట్లోనే ఈ కుక్క ఉంది. దర్శనం అనంతరం వీరి స్నేహితుడు ఒకరు జంగారెడ్డిగూడెం నుంచి కారేసుకెళ్లి భక్తులు ఇద్దరితోపాటు నందిని కారులో తీసుకువచ్చారు. ప్రతాపరెడ్డి ఈ కుక్కను పెంచుకుంటున్నారు. ప్రతాపరెడ్డి, రవి మాట్లాడుతూ ఏ జన్మలోనో శ్రీవారి మొక్కు ఉండి ఉంటుందని, ఆ మొక్కును తీర్చుకునేందుకు శునకం ఈ జన్మలో తమ వెంట వచ్చిందని భావిస్తున్నామన్నారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top