అప్పు పథంలో  ఐదు రాష్ట్రాలు

states with highest debt in india - Sakshi

రుణభారంలో పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, కేరళ టాప్‌

పంజాబ్‌ అప్పులు జీఎస్‌డీపీలో 49.5 శాతం.. ఏపీలో 32.5 శాతం మాత్రమే

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రతిష్టను రచ్చకీడుస్తూ.. శ్రీలంకతో పోలుస్తూ పదేపదే బురద చల్లుతున్న దుష్ట చతుష్టయానికి చెంపపెట్టులా ఆర్థిక పరిస్థితిపై ప్రపంచ బ్యాంకు నివేదికను వెల్లడించింది. లాక్‌డౌన్‌ తదనంతరం దేశంలోని 20 పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులను ప్రపంచ బ్యాంకు క్షుణ్నంగా పరిశోధించి సమగ్ర నివేదిక రూపొందించింది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌ అప్పులు ప్రమాదకర స్థాయిలో లేవని ప్రపంచ బ్యాంకు పరిశోధన నివేదిక నిగ్గు తేల్చింది.

కోవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో 2020–21 తొలి త్రైమాసికంలో అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)పై ప్రభావం పడటమే కాకుండా అప్పులు, ద్రవ్యలోటు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. సెకండ్‌ వేవ్‌తో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నప్పటికీ అనంతరం పుంజుకోవడంతో చాలా రాష్ట్రాల ఆదాయాలు పెరగడంతో పాటు మూలధన వ్యయం మెరుగుపడిందని తెలిపింది. ఆదాయాలు క్షీణించినప్పటికీ ఆహార సబ్సిడీలు, పెన్షన్లు లాంటి సామాజిక భద్రత చర్యలు చేపట్టడంతో వ్యయం పెరిగి అన్ని రాష్ట్రాల రుణాలు 24 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయని నివేదిక పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు అత్యధిక అప్పుల్లో ఉన్నాయని తెలిపింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ లేకపోవడం గమనార్హం. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, కేరళ రాష్ట్రాల అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2019, 2020, 2021 ఆగస్టు నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు, క్యాపిటల్‌ వ్యయం, బడ్జెట్‌ అంచనాలు, రెవెన్యూ రాబడులను ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. 2019–20లో ఆర్థిక మందగమనం కారణంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులు తగ్గిపోయాయని నివేదిక పేర్కొంది. 

పుంజుకున్న ఆదాయాలు..
ఆంధ్రప్రదేశ్‌ సహా మిగతా రాష్ట్రాలన్నింటిలో 2019 ఆగస్టుతో పోల్చితే 2020, 2021 ఆగస్టుల్లో రెవెన్యూ రాబడులు పెరిగాయని నివేదిక తెలిపింది. చాలా రాష్ట్రాల్లో క్యాపిటల్‌ వ్యయం పెరిగిందని, ఏపీలో 2019 ఆగస్టుతో పోల్చి చూస్తే  2020 ఆగస్టులో క్యాపిటల్‌ వ్యయం బాగా పెరిగిందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2019 ఆగస్టుతో పోల్చితే 2021 ఆగస్టులో బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగా రాబడులు మెరుగుపడ్డాయని, బడ్జెట్‌ అంచనాల మేరకు వ్యయం కూడా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనైనా తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే యత్నాలకు ఇకనైనా స్వస్తి పలకాలని ఆర్ధిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

నివేదికలో ముఖ్యాంశాలు...
దేశంలో అత్యధికంగా పంజాబ్‌ అప్పుల్లో ఉంది. జీఎస్‌డీపీలో ఏకంగా 49.5 శాతం అప్పులున్నాయి. 
రాజస్థాన్‌కు జీఎస్‌డీపీలో 39.5 శాతం మేర అప్పులుండగా హిమాచల్‌ప్రదేశ్‌కు 39.7 శాతం, బిహార్‌కు 38.6 శాతం, కేరళకు 37 శాతం మేర అప్పులున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్‌డీపీలో 32.5 శాతం మాత్రమే అప్పులున్నాయి. 
సొంత రాబడుల్లో పంజాబ్‌ వడ్డీ చెల్లింపులపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది.
బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ, హర్యానా రాష్ట్రాలు వచ్చే ఐదేళ్లలో చెల్లించాల్సిన అప్పుల వాటా అత్యధికంగా ఉంది.  చత్తీస్‌గడ్‌ వచ్చే ఐదేళ్లలో 59.2 శాతం, ఒడిశా 54.7 శాతం, హర్యానా 48.7 శాతం మేర అప్పులు చెల్లించాల్సి ఉంది.

కేంద్రం అప్పులే ఎక్కువ
కేంద్ర ప్రభుత్వ అప్పులు 2020–21లో ఏకంగా జీడీపీలో 61 శాతానికి చేరుకోవడం గమనార్హం. 2013– 14లో కేంద్రం అప్పులు రూ.56,69,128.48 కోట్లు కాగా 2021–22 నాటికి రూ.1,35,88,193.16 కోట్లకు పెరిగాయి.

చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top