సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం

Srikakulam District: Vandanapeta Famous For Sickle Making - Sakshi

ఒక్కో కొడవలి ధర రూ.350 పైమాటే

కోతల సీజన్‌లో విరివిగా విక్రయాలు

ఇతర జిల్లాలతో పాటు రాష్ట్రాలకు ఎగుమతి

రేగిడి(శ్రీకాకుళం జిల్లా): సాగులో ఆధునిక పద్ధతులు వచ్చినప్పటికీ వరికోతపనుల్లో మాత్రం కొడవలిదే ప్రధానపాత్ర. తరతరాలుగా కొడవలి లేనిదే వరి పంట ఇంటికి చేరదంటే అతిశయోక్తి కాదు. సర్రుమని తెగే పదునుతో పాటు చురుకైన పనితనం రేగిడి మండలంలోని వండాన పేట గ్రామం కొడవలి సొంతం, గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొడవలి తయారీ కుటీర పరిశ్రమలు ఉన్నాయి. గ్రామానికి చెందిన కనీసం పది కుటుంబాల వండ్రంగులు వాటిని తయారు చేస్తున్నారు. 

విజయవాడ నుంచి ముడిసరుకును ఇక్కడికి తీసుకువస్తారు. ముడిసరుకును బాగా కర్రబొగ్గు మధ్యలో వేడి చేసి కరిగించి కొడవలిగా మారుస్తారు. దానికి పదును పెట్టడంతో పాటు కక్కుర్లు వేస్తారు. కుడిచేతి వాటం ఉన్నవారితో పాటు పాటు ఎడమచేతి వాటం వారు కూడా ఈ కొడవలితో అవలీలగా వరి కోత కోయగలరు. సుమారు 60 మందికిపైగా కూలీలు ఈ పనిద్వారా లబ్ధిపొందుతున్నారు. నిత్యం వారికి పని ఉంటుంది. అన్‌సీజన్‌లో తయారు చేసిన వాటితో పాటు ప్రస్తుతం తయారుచేస్తున్నవి కూడా హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.   


ధరతో పాటు డిమాండ్‌ 

ఇక్కడ తయారు చేసిన కొడవలి బరువు 300 గ్రాములు ఉంటుంది. దాని పిడిని ఇరుడుకర్రతో వేస్తారు. ఒక దాని తయారీకి గంట సమయం పడుతుంది. రోజుకు సగటున నలుగురు కూలీలు 15 నుంచి 18 వరకు  తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఒక దాని ధర రూ. 300 నుంచి రూ.350లు ఉంటుంది. విజయవాడ, చీరాల, ఒంగోలు, ఒడిశా, కోల్‌కత్తా తదితర ప్రాంతాలకు కూడా ఇక్కడి కొడవళ్లు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే ముఠామేస్త్రీలు కూడా ఇక్కడి నుంచి కొడవళ్లు తీసుకుపోయి ఆయా ప్రాంతాల్లో ఒక్కోటి రూ.500కు విక్రయిస్తుంటారు.  

నిత్యం డిమాండ్‌ 
ఖరీఫ్‌ కోతల సీజన్‌ ప్రారంభం కావడంతో హాట్‌కేక్‌ల్లా అమ్ముడవుతున్నాయి. కొడవలి తయారీని నమ్ముకునే జీవనం సాగిస్తున్నాం. ప్రతి నెల రూ.15వేల వరకూ ఆదాయం వస్తుంది.  
- మేటికోటి రామకృష్ణ,  తయారీదారు, వండానపేట  

బంధువులకు పంపిస్తాం  
ఇక్కడి కొడవలితో కోత బాగా వేగంగా అవుతుంది. ఏటా కొత్తవి కొని ఇతర జిల్లాల్లో ఉన్న బంధువులకు పంపిస్తాం. ఈ  ఏడాది పంపించడానికి 20కిపైగా కొనుగోలు చేశాను.  - పైల తవిటినాయుడు, రైతు, చాటాయివలస

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top