గంజాయి దందాకు ఉమ్మడి బ్రేక్‌

Special teams to crack down on marijuana smuggling Andhra Pradesh - Sakshi

పొరుగు రాష్ట్రాల్లో సాగు.. ఏపీలోంచి స్మగ్లింగ్‌

అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక బృందాలు

ఒడిశా పోలీసు అధికారులతో కలిసి సమన్వయ కమిటీ

అంతర్‌రాష్ట్ర మార్గాల్లో నిఘా పటిష్టం.. ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు

సాక్షి, అమరావతి: సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పోలీసు శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలతో నిఘాను పటిష్టం చేస్తోంది. మొదటిదశగా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో రెండురాష్ట్రాల పోలీసులు సంయుక్త కార్యాచరణ చేపట్టారు. దేశంలో ఇలా గంజాయి దందాకు అడ్డుకట్ట వేసేందుకు ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టిన తొలిరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తరువాత దశల్లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలతో కూడా ఉమ్మడి కార్యాచరణను విస్తరించాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఆపరేషన్‌ పరివర్తన్‌ ద్వారా రాష్ట్రంలో గంజాయి సాగును దాదాపుగా ధ్వంసం చేసినప్పటికీ సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమంగా సాగుచేస్తున్న గంజాయిని రవాణా చేసేందుకు మన రాష్ట్ర భూభాగాన్ని గేట్‌వేగా ఉపయోగిస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన గంజాయి ముఠాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కొనుగోలు చేసిన గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

ఈ గంజాయి దందాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ పోలీసు శాఖ ఒడిశా పోలీసులతో కలిసి కొన్ని నెలల కిందటే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ/ఓఎస్డీ, డీఎస్పీలు, ఒడిశాలోని కోరాపుట్, మల్కనగిరి, జైపూర్‌ జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఒడిశాలో గంజాయి సాగును శాసిస్తున్న ముఠాల వివరాలను కూడా ఏపీ పోలీసులు ఆ రాష్ట్ర పోలీసులకు అందించారు.

ఏపీ పోలీసులు ఇచ్చిన 38 మంది గంజాయి స్మగ్లర్ల వివరాల మేరకు ఆయా గ్రామాల్లో ఒడిశా ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. మరోవైపు రెండు రాష్ట్రాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులను భాగస్వాములుగా చేసుకుని నిఘాను పటిష్టం చేశారు. ప్రధానంగా ఒడిశాలోని చిత్రకొండ, జోలాపుట్, మల్కనగిరి ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి అనుసంధానించే ప్రధాన రహదారులతోపాటు ఇతర మార్గాల్లో గస్తీని ముమ్మరం చేశారు.

ఆ మార్గాల్లో ఇప్పటికే అటు ఒడిశా, ఇటు ఏపీ వైపు కొత్తగా ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒడిశా వైపు చిత్రకొండ, సుకుమా, జోలాపుట్, పడువ, సిమిలిగూడల్లో ఒడిశాకు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని సీలేరు, డొంకరాయి, మారేడుమిల్లి, రంపచోడవరం, గోకవరం, మోతుగూడేల్లో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) బృందాలు తనిఖీలు విస్తృతం చేశాయి. 

త్వరలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణలతో కలిసి..
ఇదే తరహాలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులతో కూడా కలిసి త్వరలో కార్యాచరణ చేపట్టాలని ఏపీ పోలీసు శాఖ భావిస్తోంది. అందుకోసం ఛత్తీస్‌గఢ్‌ పోలీసు శాఖతో ఇప్పటికే ప్రాథమికంగా చర్చించింది. త్వరలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఏపీ పోలీసు ఉన్నతాధికారులు చర్చించనున్నారు. పొరుగు రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)కి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు.

మన రాష్ట్రంలో ఆపరేషన్‌ పరివర్తన్‌ను విజయవంతంగా నిర్వహించిన తీరును ఎన్‌సీబీ నిశితంగా పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల వ్యూహాన్ని అనుసరించమని ఇతర రాష్ట్రాలకు సూచించింది కూడా. గంజాయి ప్రభావిత రాష్ట్రాల డీజీపీలతో త్వరలో ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఎన్‌సీబీ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top