Valentine's Day: ఇట్లు.. నీ ప్రేమ..

Special Story On Valentines Day - Sakshi

అనంతపురం కల్చరల్‌: ప్రేమ సత్యం.. ప్రేమ నిత్యయవ్వనం..ప్రేమ వినూత్నం..ప్రేమ మధురం..ప్రేమను ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. తడారిపోయిన మనసుల్లో పచ్చని ఆశలు చిగురింపజేసేది ప్రేమ. శిలలాంటి మనిషికి జీవం పోసేది ప్రేమ. కులమతాలను, దేశ సరిహద్దులను చెరిపేసేది ప్రేమ...ధనిక, పేద తారతమ్యాన్ని చెరిపేస్తుంది..బంధాలను వేరుచేసినా..బాంధవ్యాలను దగ్గరికి చేరుస్తుంది. ప్రేమైక జీవనం తనువులు వేరైనా..మనసులు ఒకటని చాటిచెప్తుంది. ప్రేమలో విజయం సాధించి, ఆదర్శంగా నిలిచిన వారి మధురానుభూతులు, జ్ఞాపకాలను నెమరేసుకునే రోజు ‘ప్రేమికుల దినోత్సవం’.. సోమవారం (ఫిబ్రవరి 14) వాలంటైన్స్‌డే  సందర్భంగా ప్రత్యేక కథనం.

చదవండి: ‘ఐ లవ్‌ యూ’ చెప్తే సరిపోదండోయ్‌.. ఈ అయిదూ పాటిస్తే లవ్‌ లైఫ్‌ లక్కీనే

అభి‘మత’మొక్కటే
అనంతపురానికి చెందిన ఓమేశ్వర చక్రవర్తి డిగ్రీ చదువుతున్న సమయంలో రిజ్వానా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డారు. కానీ పెద్దలు మతాంతరం అంటే భయపడిపోయారు. ప్రేమ పెళ్లికి   ససేమిరా అన్నారు. కానీ వారు అనేక కష్టాలకోర్చి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. భర్త కోసం రిజ్వానా (శశికళా బాయిగా పేరు మార్చుకుంది) హిందూ స్త్రీగా మారిపోయినా ఇస్లాంను అంతే గౌరవిస్తుంది. వీరి ఇద్దరు కూతుళ్లు ఏ మతం పాటించినా తల్లిదండ్రులిద్దరూ అంగీకరించడంతో వారిల్లే ఒక స్ఫూర్తి కేంద్రంగా మారింది.

పెద్దలను ఒప్పించాలి
వాసంతి సాహిత్య నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌. భర్త బండి శ్రీకాంత్‌. వేర్వేరు కులాలకు చెందిన వీరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 2007లో  వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ‘‘కులాలు, మతాలు అనేవి మనం ఏర్పరచుకున్నవి. దానికి అతీతంగా ఆలోచించినపుడే మన ఇష్టాలను నెరవేర్చుకోగలం. యువత ఆకర్షణను ప్రేమ అనుకోకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ విషయంలో తల్లిదండ్రులను నొప్పించకుండా ఒప్పించడం అనేది అందరూ నేర్చుకోవాలి. అదే విజయ సూత్రంగా కూడా మారుతుంది’’ అని వారంటున్నారు.

ఐదేళ్ల నిరీక్షణ..
రాగే హరిత ఏపీ రాష్ట్ర నాటక అకాడమీ చైర్‌పర్సన్‌. సామాజిక ఉద్యమాలతో మమేకమైన చామలూరు రాజగోపాల్‌తో ఆమె పరిచయం, పరిణయం విచిత్రంగానే సాగింది. కులాల అడ్డు గీతలున్నా వారిద్దరూ ఒకటి కావడానికి ప్రేమ వారధిగా నిలిచింది. 2005లో వారిద్దరూ ఎస్కేయూలో చదువుకుంటున్నప్పుడు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు సహజంగానే అంగీకరించలేదు. ఐదేళ్లు నిరీక్షించి వివాహం చేసుకున్నారు. పెద్దలు కూడా అర్థం చేసుకున్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ప్రేమ అజరామరమైంది.. ఆస్వాదించేవారికే దాని విలువ తెలుస్తుంది’ అని అన్నారు.

సంతోషమయ జీవితం
నల్లమాడ: ముదిగుబ్బ మండల కేంద్రంలో పక్కపక్క వీధుల్లో నివాసం ఉండే మహేష్, త్రివేణికి 2005లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. సమీప బంధువు సహకారంతో 2013లో మహే‹Ù, త్రివేణి పెళ్లి చేసుకున్నారు. పిల్లలు (సాతి్వక్, ప్రణవి) పుట్టాక ఇరు కుటుంబాల పెద్దలూ పంతాలు వీడి కలసిపోయారు. ప్రస్తుతం మహే‹Ù, త్రివేణి నల్లమాడ మండలంలోని వేర్వేరు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top