Pedapalem: పచ్చని పల్లె.. కరోనాకు హడలే 

Special Story On Gudlavalleru villagers for covid prevention - Sakshi

గుడ్లవల్లేరు మండలం పెదపాలెంలో కఠిన నిబంధనలతో మహమ్మారికి అడ్డుకట్ట 

ఊళ్లోకి రావొద్దని బంధుమిత్రులకు ముందే చెప్పిన గ్రామస్తులు 

ఎవరూ ఊరు దాటి వెళ్లకుండా సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ అమలు 

గుడ్లవల్లేరు (గుడివాడ): ఇంటి పట్టునే ఉంటే కరోనా సోకదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో పెదపాలెం గ్రామస్తులు అదే మాటను కట్టుబాటుగా చేసుకున్నారు. ఊరి పట్టునే ఉంటే కరోనా సోకదని నిరూపిస్తున్నారు కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు శివారు పెదపాలెంలో 125 కుటుంబాలుండగా.. గ్రామ జనాభా 300కు పైగానే ఉంది. ఆకు పచ్చ చీర కట్టినట్టుగా ఉండే ఆ పల్లె కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తూ.. మహమ్మారిని దరిచేరకుండా గ్రామస్తుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. పొలం పనులు చేసే సమయంలోనూ కరోనా నియమావళిని బాధ్యతగా పాటిస్తోంది. 

కఠిన నిబంధనలే శ్రీరామరక్షగా.. 
ఎలాంటి అవసరం ఉన్నా ఎవరూ ఊరు దాటి వెళ్లకూడదనే కఠిన నియమాన్ని పెట్టుకున్నారు. గ్రామం నుంచి బయటకు.. బయటి నుంచి గ్రామంలోకి ఎలాంటి రాకపోకలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. బంధుమిత్రులను కూడా ఊరిలోకి రానివ్వడం లేదు. తమ వారందరికీ ముందే ఈ విషయం తెలియజేశారు. తప్పనిసరి అవసరాల కోసం బయటకు వెళ్లినా నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. గ్రామంలో ఉన్న వనరులతోనే ఆహార అవసరాలు తీర్చుకుంటున్నారు. గ్రామస్తులంతా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు గ్రామంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. 

ఎవర్నీ రానివ్వటం లేదు 
ఎవర్నీ ఊరిలోకి రానివ్వడం లేదు. మేం కూడా ఊరు దాటి వెళ్లకుండా లాక్‌డౌన్‌ పెట్టుకున్నాం. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లను వాడుతున్నాం.  
– గుమ్మడి నరసింహారావు, గ్రామస్తుడు 

బయట అవసరాలకు మాత్రమే 
మా గ్రామం నుంచి దాదాపుగా ఎవరూ బయటకు వెళ్లడం లేదు. బయట అవసరాలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరిద్దరు మాత్రమే జాగ్రత్తలు పాటిస్తూ వెళ్తున్నారు. 
– విజయలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్‌ 

శానిటేషన్‌ ఒక కారణమే... 
కరోనా వచ్చిన నాటి నుంచి పెదపాలెంలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నాం. గ్రామస్తులు కట్టుబాట్లతోనే వైరస్‌కు దూరంగా ఉన్నారు. 
– కనుమూరి రామిరెడ్డి, కొండాలమ్మ ఆలయ చైర్మన్‌ 

ప్రజల సహకారంతోనే.. 
ప్రజలు ఇంటి పట్టునే ఉండటం వల్ల గ్రామంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా రాలేదు. చేతుల్ని శుభ్రం చేసుకోవటం, మాస్కులు ధరించటం, పారిశుధ్య పనులను చేపట్టడం ద్వారా కరోనాను కట్టడి చేస్తున్నాం. 
– ఓగిరాల వెంకటరత్నం, గ్రామ కార్యదర్శి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top