‘వైఎస్సార్‌ పశుసంజీవని’కి శ్రీకారం

Sidiri Appalaraju launched YSR Pashu Sanjeevani scheme online - Sakshi

ఆన్‌లైన్‌లో పథకాన్ని ప్రారంభించిన మంత్రి అప్పలరాజు 

పశుపోషకుల ఇంటి వద్దకే వైద్యసేవలు 

ఆర్బీకే స్థాయిలో ప్రత్యేక పశువైద్య శిబిరాలు 

సాక్షి, అమరావతి: స్పెషలిస్ట్‌ వైద్యులతో నాణ్యమైన వైద్యసేవలను పశుపోషకుల గడప వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ పశుసంజీవని పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు బుధవారం ఆన్‌లైన్‌లో ప్రారంభించారు.  స్పెషలిస్ట్‌ బృందాలకు ఈ పథకం కింద ప్రత్యేకంగా సర్జికల్, గైనిక్, మెడికల్‌ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటి వరకు స్పెషలిస్టు పశువైద్యులు తమ ఆస్పత్రి పరిధిలో మాత్రమే వైద్యసేవలు అందించేవారు. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ మారుమూల పల్లెల్లో సైతం స్పెషలిస్ట్‌ డాక్టర్ల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌ పశుసంజీవని పథకం ప్రారంభించారు.  

స్పెషలిస్ట్‌ డాక్టర్లతో ఏర్పాటు చేసిన వైద్య బృందాల ద్వారా ఆర్బీకే స్థాయిలో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో పశుపోషకుల ఇంటివద్ద పారా సిబ్బంది, పశుసంవర్ధక సహాయకుల సహకారంతో వైద్యసేవలందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలు. డివిజన్‌కు ఒకటి చొప్పున రూ.1.20లక్షల విలువైన కాల్పోస్కోప్‌ను అందజేశారు. ప్రతి వైద్య బృందానికి రూ.లక్ష విలువైన శస్త్ర చికిత్సలు చేయతగ్గ పరికరాలతో కూడిన కిట్లతో పాటు రూ.10వేల విలువైన మందుల కిట్లను కూడా అందజేస్తున్నారు. ఇక వైద్యసేవలందించే స్పెషలిస్ట్‌ వైద్యులకు శిబిరాలకు వెళ్లే సమయంలో రవాణా చార్జీల కోసం ఒక్కో వైద్యునికి రూ.10వేలు అందజేస్తారు. వీటి కోసం రానున్న రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.74కోట్లు ఖర్చు చేయనుంది. 

త్వరలో 340 సంచార పశువైద్యశాలలు 
ఆరోగ్యకరమైన పశుసంపద ద్వారా పశుపోషణ లాభదాయకంగా మార్చాలన్న లక్ష్యంతో ‘వైఎస్సార్‌ పశు సంజీవని’ పథకాన్ని ప్రారంభించాం. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు త్వరలో  340 సంచార పశు వైద్యశాలలను ప్రారంభిస్తాం. 
– డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top