
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అధికారులను నిలదీసిన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్
గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,052.71 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చాం
వాటిని ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేసి ప్రాజెక్టు పనులకే వాడాలని చెప్పాం
అయినా సరే, ఇప్పటికీ రూ.1,830 కోట్లు ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో వేయలేదు
ఇతర అవసరాలకు మళ్లించారు
నిర్వాసితులకు రూ.1,107.62 కోట్లు పెండింగ్‌లో పెట్టారు
ఇచ్చిన నిధులకు వినియోగ పత్రాలు సమర్పిస్తేనే రూ.5,936 కోట్లు విడుదల చేస్తామని స్పష్టికరణ
సాక్షి, అమరావతి: ‘‘పోలవరం ప్రాజెక్టు పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేసేలా నిధుల కొరత తలెత్తకుండా ఉండేందుకు 2024–25లో రెండు విడతల్లో రూ.5,052.71 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చాం. వాటిని సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్‌ఎన్‌ఏ) ఖాతాలో జమ చేసి పోలవరం పనులకు మాత్రమే ఖర్చు పెట్టాలని నిర్దేశించాం. అయినాసరే ఆ నిధుల్లో ఇప్పటికీ రూ.1,830 కోట్లను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో వేయలేదు. అంటే, ఇతర అవసరాలకు మళ్లించారు. ఇలాగైతే పోలవరం గడువులోగా ఎలా పూర్తవుతుంది?’’ అంటూ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నిలదీశారు.
‘నిర్వాసితులకు నగదు పరిహారం చెల్లింపు, పునరావాస కాలనీల పనులు, సేకరించిన భూమికి నిర్వాసితులకు పరిహారం ఇవ్వడానికి సంబంధించిన బిల్లులే రూ.1,107.62 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. కేంద్రం ఇచ్చిన అడ్వాన్సులో రూ.1,830 కోట్లు దారి మళ్లించేశారు. ఇలాగైతే సకాలంలో నిర్వాసితులకు ఎప్పుడు పునరావాసం కల్పిస్తారు?’’ అని సూటిగా ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్సుగా ఇచ్చిన రూ.5,052.71 కోట్ల నిధుల వినియోగానికి సంబంధించిన వినియోగ పత్రాలు (యుటిలిటీ సరి్టఫికెట్–యూసీ) పంపితేనే, ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరానికి కేటాయించిన రూ.5,936 కోట్లను విడుదల చేస్తామని తేల్చిచెప్పారు.
పోలవరం పనుల పురోగతిపై సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ అతుల్‌జైన్, వ్యాప్కోస్, సీఎస్‌ఎంఆర్‌ఎస్ అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
⇒ పోలవరం పనుల పురోగతిపై పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు వివరించారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయా ఫ్రం వాల్ పనులు 56 శాతం జరిగాయని, గ్యాప్–1లో వరద ఉధృతితో కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే, కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే, ఎడమ కాలువ పనులు సాగుతున్న తీరును సమగ్రంగా వెల్లడించారు.
ఏడాదిగా ఒక్క కుటుంబానికీ పునరావాసం లేదు
41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయాలంటే 1,00,099 ఎకరాలకు గాను 91,156 ఎకరాలు సేకరించారని ఇంకా 8,943 ఎకరాలు సేకరించాల్సి ఉందని రఘురాం తెలిపారు. 38,060 నిర్వాసిత కుటుంబాలకు గాను ఇంకా 23,689 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని, ఏడాదిగా ఒక్క కుటుంబానికి కూడా పునరావాసం కల్పించలేదని తెలిపారు. దీనిపై వీఎల్ కాంతారావు స్పందిస్తూ, అడ్వాన్సు నిధులను సద్వినియోగం చేస్తేనే ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయగలరని, కానీ... రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో వేయకుండా, ఇతర అవసరాలకు మళ్లిస్తోందని, ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాశామని ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే.. పోలవరం పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి వ్యక్తంచేసిందని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సోమవారం కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబరుకల్లా.. వీలైతే పుష్కరాలకు ముందే పోలవరం పూర్తిచేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామన్నారు.
డిసెంబరులో వస్తా.. పనులను గాడిలో పెట్టాలి
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పందిస్తూ... పోలవరాన్ని 2026 మార్చి నాటికి విపత్తులు ఎదురైతే మరో ఏడాది (2027 మార్చి)లోగా పూర్తి చేయాలని గడువుగా నిర్దేశించి రూ.12,157 కోట్లను కేంద్ర కేబినెట్ మంజూరు చేసిందని కేంద్రమంత్రి పాటిల్ గుర్తు చేశారు. ఈ క్రమంలో నిధుల కొరత లేకుండా 2 విడతలుగా అడ్వాన్సు ఇచ్చామని చెప్పారు.
వాటిని సది్వనియోగం చేసుకోకపోతే ప్రాజెక్టును సకాలంలో ఎలా పూర్తి చేయగలరని రాష్ట్ర మంత్రి రామానాయుడుని, జల వనరుల శాఖ అధికారులను నిలదీశారు. ‘‘నేను డిసెంబరులో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా. ఆలోగా పనులను గాడిలో పెట్టాలి’’ అని స్పష్టం చేశారు. పీపీఏ, సీడబ్ల్యూసీ, అంతర్జాతీయ నిపుణుల కమిటీతో సమన్వయం చేసుకుంటూ 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.