Seethampeta: వనవిహారీ.. ఇదీ దారి

Seethampeta Tourist Spots And Waterfalls In Srikakulam District - Sakshi

వేకువ గాలులు నొసటన ముద్దాడుతూ ఉంటే ఈ కొండల్లో విహరించాలి. సూరీడి కిరణాలు నడినెత్తిపై వచ్చే వేళకు ఆ జలపాతం మన శిరసుపై నుంచి పాదాలపైకి దూకాలి. కడుపు లోపల చల్ల కదలకుండా సున్నపుగెడ్డ మధ్యన నడుం వాల్చాలి. వెలుతురు వెళ్లి చీకటి ఇంకా రాని ఆ కొన్ని ఘడియల పాటు చెమట్లు వచ్చేలా సాహస క్రీడల్లో మునిగి తేలాలి. కార్తీక వన విహారానికి ఇంతకు మించిన సాఫల్యత ఏముంటుంది..? ఇవన్నీ నిజం కావాలంటే మంచి సెలవు రోజు చూసుకుని చలో సీతంపేట అనేయడమే. 

సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం): సీతంపేట రారమ్మంటోంది. కార్తీకంలో వన విహారానికి తన బెస్ట్‌ టూరిజం ప్రదేశాలను చూపిస్తూ ఆకర్షిస్తోంది. ఓ వైపు జలపాతాలు, మరోవైపు పార్కు, ఇంకో వైపు అడవుల అందాలతో మన్యం అద్భుతంగా కనిపిస్తోంది. ఏటా ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు, జగతపల్లి, ఆడలి వ్యూపాయింట్‌లను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలతో పాటు ఇటు ఒడిశా నుంచి కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు. 

సాహస క్రీడా వినోదం
సీతంపేట అడ్వంచర్‌ పార్కు స్థానికంగా దోనుబాయి రహదారి మలుపునకు సమీపంలో ఉంది. ఇక్కడ జలవిహార్‌లో బోటుషికారు ఏర్పాటు చేశారు. సైక్లింగ్, జెయింట్‌వీల్, ఆల్‌టర్న్‌ వెహికల్, షూటింగ్, బంజీట్రంపోలిన్‌ వంటివి ఉన్నాయి.  

సున్నపుగెడ్డకు ఇలా..  
ఏజెన్సీలోని సున్నపు గెడ్డ జలపాతానికి మంచి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ వాతావరణం చూపరుల్ని కట్టిపడేస్తుంది. దోనుబాయి గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సున్నపుగెడ్డ ఉంది. పొల్ల– దోనుబాయి మార్గంలో మేకవ గ్రామానికి సమీపంలో రోడ్డుదిగువ గుండా నడుచుకుంటూ వెళితే సున్నపుగెడ్డ జలపాతానికి చేరుకోవచ్చు. బస్సులు పరిమితంగా ఉంటాయి. సీతంపేట వచ్చి ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. సదుపాయాలు అంతంత మాత్రమే. తిను బండారాలు ఇతర ఆహార సామగ్రి పర్యాటకులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది.  

మెట్టుగూడ.. ఇక్కడ.. 

మెట్టుగూడ జలపాతం మంచి ప్రాచుర్యం పొందింది. మా మూలు రోజుల్లో కూడా ఇక్కడకు వచ్చే సందర్శకుల సంఖ్య అ ధికంగా ఉంటుంది.  

► సీతంపేట నుంచి కొత్తూరుకు వెళ్లే రహదారిలో ఈ జలపాతం ఉంది.  

► కొత్తూరు నుంచి వస్తే 10 కిలోమీటర్లు, పాలకొండ నుంచి వస్తే 17 కిలోమీటర్ల దూరంలో రహదారి పక్కనే మెట్టుగూడ వస్తుంది.  

► అక్కడ వాహనాలు దిగి కొద్ది దూరం నడిచి వెళ్తే జలపాతాన్ని చేరుకోవచ్చు.  

► ఆర్టీసీ బస్సులు పాలకొండ–కొత్తూరు నుంచి అనునిత్యం తిరుగుతుంటాయి.  పర్యాటకులకు అన్ని సౌకర్యాలున్నాయి.  

వ్యూపాయింట్‌ భలే 

పొల్ల: సున్నపుగెడ్డకు సమీపంలో పొల్ల వ్యూ పాయింట్‌ ఉంది.  

ఆడలి: ఏజెన్సీలోని ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లాలంటే కుశిమి జంక్షన్‌ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రత్యేక వాహనాల్లో వెళ్లాలి.   

జగతపల్లి: సీతంపేట నుంచి7 కిలోమీటర్ల దూరంలో జగతపల్లి ఉంది. వీటిని వీక్షించడానికి ప్రత్యేక టూరిజం వెహికల్‌ను ఏర్పాటు చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top