గ్రిల్స్, విద్యుత్‌లైట్లు దొంగిలించడంతో ప్రమాదభరితంగా మారిన విద్యుత్ వైర్లు
యథేచ్ఛగా ఫుట్‌పాత్‌పై లైట్లు చోరీ పట్టించుకోని అధికారులు
తాడేపల్లి రూరల్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద ప్రభుత్వ భద్రతా లోపం మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద నిత్యం భద్రతను పర్యవేక్షిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నా... ఆ ప్రాంతంలో దొంగలు చెలరేగిపోతున్నారు. రోడ్డు వెంబడి ఉన్న ఫుట్‌పాత్ లైట్లు, ఐరన్ గ్రిల్స్‌ను కట్ చేసి తీసుకువెళుతున్నా పోలీసులు గుర్తించలేకపోతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని భరతమాత సెంటర్ నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం మీదుగా ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వరకు రహదారికి ఇరువైపులా మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో గతంలో రోడ్డు నిర్మించారు.
రహదారి ఫుట్‌పాత్ వెంబడి లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ లైట్లకు భద్రత కోసం డిజైన్ కలిగిన ఐరన్ గ్రిల్స్‌ను పెట్టారు. కొద్దిరోజులుగా గ్రిల్స్ సహా లైట్లను వచ్చినంత వరకు దొంగలు కట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ తీగలను ఫుట్‌పాత్‌పై వదిలివేయడంతో ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. పొరపాటున విద్యుత్ సరఫరా అయితే ఫుట్‌పాత్‌పై ప్రయాణించే వారితోపాటు ఉదయం సాయంత్రం వాకింగ్ చేసేవారికి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దర్జాగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి దొంగిలిస్తుంటే కార్పొరేషన్ అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.


