అలల కల్లోలం..

Sea Level Rise Due To Low Pressure And Amavasya Effect - Sakshi

పౌర్ణమి, అమావాస్య ఘడియల్లో ఉప్పొంగుతున్న కడలి

అల్పపీడనానికి తోడు తాజాగా అమావాస్య ప్రభావం

అంతర్వేదికర, పల్లిపాలెం, ఎస్‌.యానాం గ్రామాల్లోకి సముద్రపు నీరు 

సఖినేటిపల్లి: ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, అమావాస్య ఘడియలకు అంతర్వేది వద్ద తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడే అలలు తీర ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు నెలలుగా పౌర్ణమి, అమావాస్య ఘడియల్లో పోటెత్తుతున్న ఉప్పునీరు, ప్రస్తుత అల్పపీడన ప్రభావానికి అమావాస్య తోడవడంతో సముద్రుడు మరింత ఉగ్రుడవుతున్నాడు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. శుక్రవారం సముద్ర కెరటాలు తీరాన్ని దాటుకుని సుమారు 500 మీటర్ల మేర అంతర్వేదికర కొత్త వంతెనకు సమీపంలో రోడ్డును దాటి సరుగుడు తోటల్లోకి చేరాయి. సాగరసంగమానికి సమీపాన ఉన్న పల్లిపాలెంలో ఇళ్ల వద్దకు కూడా ఉప్పునీరు పోటెత్తింది. అంతర్వేదికర గ్రామంలో ఉప్పునీరు పోటెత్తిన ప్రాంతాలను, పల్లిపాలెంలో ముంపునకు గురైన నివాస గృహాలను తహసీల్దార్‌ రామ కుమారి పరిశీలించారు. ముంపు నీటి వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఆమె వెంట ఆర్‌ఐ బి.మనోజ్, వీఆర్వో బొల్లాప్రగడ సీతారామం, గ్రామస్తులు  ఉన్నారు.

పర్ర ప్రాంతానికి పోటెత్తిన ఉప్పునీరు
ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్‌.యానాం సముద్ర తీరంలో శుక్రవారం ఉదయం సముద్రపు అలలు బీచ్‌ రోడ్డు పల్లపు ప్రాంతంలోకి భారీగా చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బీచ్‌రోడ్డు వద్ద కట్టు కాలువ వంతెన సమీపంలో ఎస్‌.యానాంలోని రవ్వ చమురు సంస్థ ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌లకు పైపులైన్‌ ఏర్పాటు చేసిన ప్రాంతంలో పల్లంగా ఉండటం వల్ల అక్కడే సముద్రపు అలలు ఎగసి పడి నీరు కట్టు కాలువను దాటుకుని పర్ర ప్రాంతానికి ఎగబాకాయి. దీంతో పైప్‌లైన్‌ ఉన్న ప్రాంతంలో గాడిలా ఏర్పడి కాలువలా తయారయ్యింది. ఒక దశలో పైపులైన్‌ లీకయ్యిందంటూ వదంతులు వ్యాపించడంతో రవ్వ అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రపు అలలు వస్తున్న ప్రాంతాన్ని రవ్వ యాజమాన్య సిబ్బంది పరిశీలించి, సముద్రపు పోటు అధికంగా ఉండటం వల్ల ఇలా జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్యాహ్న సమయం వరకూ సముద్రపు నీరు భారీగా పర్రలోకి చేరడంతో డ్రెయిన్ల ద్వారా ఉప్పనీరు పంట పొలాలకు చేరుతోందని స్థానికులు, రైతులు ఆందోళన చెందారు. తహసీల్దారు కె.పద్మావతి, ఆర్‌ఐ ఎన్‌.ప్రసూన, వీఆర్‌ఓ రాములు బీచ్‌ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అమావాస్య, అల్పపీడన ప్రభావంతో ఆటు పోట్లకు సముద్రం అల్లకల్లోలంగా మారిందని తేల్చారు.

అంతర్వేదికరలో కొత్తవంతెన వద్ద రోడ్డును దాటుకుని సరుగుడు తోటల్లోకి చొచ్చుకు వస్తున్న ఉప్పునీరు 

నేలకొరిగిన భారీ వృక్షాలు.. కోతకు గురైన తీరం..
అల్లవరం: ఓడలరేవు తీరం వద్ద రక్షణగా ఉన్న కరకట్టలను, సరుగుడు తోటలను దాటుకుంటూ సముద్ర అలలు పల్లపు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ వృక్షాలు సైతం కెరటాల తాకిడికి నేలకొరిగాయి. గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన అలల తాకిడి శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. దీని ప్రభావంతో తీరం కోతకు గురైంది. తీరానికి ఆనుకుని ఉన్న ఆక్వా చెరువులు సముద్రపు నీటితో నిండిపోయాయి. ఓడలరేవు ఆ‹ఫ్‌షోర్‌ టెరి్మనల్‌ ప్రహరీ, ఓడలరేవు తీరానికి పర్యాటకంగా పేరు తెచ్చిపెట్టిన సముద్ర రిసార్ట్సు గోడలను కెరటాలు తాకాయి. అమావాస్య ప్రభావంతో సముద్రం ముందుకు వచ్చిందని, దీని ప్రభావం మరో మూడు, నాలుగు రోజులు ఉంటుందని అధికారులు అంటున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top