జగనన్న దసరా కానుక

SC ST Industrialists Comments About CM YS Jagan - Sakshi

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల మనోగతం 

సాక్షి, అమరావతి: ‘రాయితీలు ఎంతో ఉపయోగపడతాయి. కోవిడ్‌ సమయంలో రాయితీలు ఇచ్చి ఆదుకున్నారు. జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది’ అని పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించేందుకు ‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల మనోగతం ఇలా ఉంది. 

రూ.కోటి సబ్సిడీ.. ఇదే తొలిసారి
వైఎస్సార్‌ గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. అయితే ఇవాళ్టి పాలసీ దేశంలోనే తొలిసారి. కోటి రూపాయల సబ్సిడీని ఎక్కడా ఇవ్వడం లేదు. నైపుణ్యాభివృద్ధి నుంచి ఉత్పత్తి వరకు అన్ని కోణాల్లోనూ ఆలోచించారు. ఎస్సీ, ఎస్టీలకు జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది. ప్రభుత్వంతో కలిసి మేం అడుగులు ముందుకు వేస్తున్నాం. డీఐసీసీఐ (దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) నుంచి పూర్తి సహకారం అందిస్తాం. దేశంలోని దళిత పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం.  
 – నర్రా రవికుమార్, డీఐసీసీఐ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

ఇన్సెంటివ్‌తో ఎంతో ఉపయోగం
నేను నోట్‌బుక్‌లు తయారు చేస్తున్నాను. ఏడాదిలో కేవలం ఆరు నెలలు మాత్రమే మా యూనిట్‌ పని చేస్తుంది. ఈసారి కోవిడ్‌ వల్ల పాఠశాలలు ఆరు నెలలు వాయిదా పడ్డాయి. దీంతో యూనిట్‌ నడవక చాలా ఇబ్బంది పడ్డాం. ఈ పరిస్థితుల్లో మీరు ఇచ్చిన ఇన్సెంటివ్‌ ఎంతో ఉపయోగపడింది. నవరత్నాలు, ఇతర పథకాలతో ప్రతి కుటుంబంలో ఆనందం నిండింది. ప్రభుత్వ స్కూళ్లంటే ఉన్న చెడు భావన ఇప్పుడు పోయింది.        
    – సి.సుజాత, సూరంపల్లి, గన్నవరం మండలం, కృష్ణా 

రూ.21 లక్షల సబ్సిడీ పొందాను
నా పరిశ్రమలో 25 మంది ఉపాధి పొందుతున్నారు. రూ.45 లక్షల యంత్రాలకు రూ.15 లక్షల సబ్సిడీ వచ్చింది. విద్యుత్‌ చార్జీలో కూడా సబ్సిడీ ఇచ్చారు. ఆ విధంగా దాదాపు రూ.21 లక్షల సబ్సిడీ వచ్చింది. కరోనా కష్టకాలంలోనూ చిన్నతరహా పరిశ్రమలను ఆదుకున్నారు. దీంతో విజయవంతంగా నా పరిశ్రమను నడిపించుకోగలుగుతున్నాను. వివిధ పథకాల కింద రూ.60 వేలకుపైగా లబ్ధి కలిగింది. 
– సీహెచ్‌ ఏసుపాదం, ఐఎంఎల్‌ పాలిమర్స్‌ కంపెనీ, పశ్చిమగోదావరి 

మమ్మల్ని నిలబెట్టారు
నేను డిప్లొమా చేశాను. ఒక ఫార్మా కంపెనీలో 17 ఏళ్లు పని చేశాను. ఆ తర్వాత రూ.12 కోట్లు పెట్టుబడితో సీపీఆర్‌ కంపెనీ స్థాపించి, బల్క్‌ డ్రగ్‌లు తయారు చేస్తున్నాను. తొలి ఏడాది చాలా ఇబ్బంది పడ్డాను. ఓ వైపు బ్యాంక్‌ ఈఎంఐ.. మరోవైపు మార్కెట్‌ లేదు.. ఇంకోపక్క కోవిడ్‌.. ఈ సమయంలో మీరు ఇచ్చిన రీస్టార్ట్‌ ప్యాకేజి నాతో పాటు నా దగ్గర పని చేస్తున్న 50 మంది కుటుంబాలకు పునర్జన్మలాంటిది.  
    – డి.రవికుమార్, విశాఖపట్నం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top