
సాక్షి, అమరావతి: సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని, ప్రభుత్వం ఏర్పడగానే సబ్‌కమిటీ వేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలో గురువారం జరిగిన ఏపీఎన్‌జీవో సంఘం మాజీ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖరరెడ్డి అభినందనసభలో ఆయన ప్రసంగించారు. సీపీఎస్ రద్దు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో కొన్ని సమస్యలున్నా మాటిచ్చినందున సాధ్యాసాధ్యాలను చూడాలని సీఎం చెప్పారన్నారు.
కరోనా వంటి కష్టసమయంలో కూడా సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల ఇంటిముంగిటకు తీసుకెళ్లిన ఘనత ఉద్యోగులదేనని, వారందరినీ అభినందిస్తున్నట్లు సీఎం చెప్పమన్నారని తెలిపారు. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పారు. చంద్రశేఖరరెడ్డి సేవలను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధనరెడ్డి, మద్యవిమోచన సమితి చైర్మన్ లక్ష్మణరెడ్డి, ఎపీఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు చంద్రశేఖరరెడ్డిని సత్కరించారు.