
సాక్షి, అమరావతి: సర్వీసులో చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల చివరి మొత్తాల చెల్లింపులకు యాజమాన్యం అంగీకరిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల చివరి చెల్లింపులైన గ్రాట్యుటీ, ఆర్జిత లీవులు, చివరి నెల జీతాలను చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఇవ్వనున్నారు.
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల చివరి మొత్తాలు ఆడిట్ చేసి నవంబర్ ఐదో తేదీలోగా కేంద్ర కార్యాలయానికి రికార్డులు పంపాలని ఉత్తర్వులిచ్చారు. సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు తమ ఆధార్, పాన్, బ్యాంకు అకౌంట్స్ వివరాలను సమీప బస్ డిపోలో అందించాలని ఉత్తర్వుల్లో కోరారు.