Guntur: ఇన్‌స్టాగ్రామ్‌ ఆధారంగా దారి దోపిడీ దొంగ అరెస్టు

Robber Arrested Based On Instagram At Pedakakani - Sakshi

పెదకాకాని: జాతీయ రహదారిపై దారిదోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. పెదకాకాని పోలీసు స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన నామాల సతీష్‌ అతని తండ్రి రామకృష్ణారావులు నవంబరు 18న తెనాలి మండలం కొలకలూరి గ్రామంలో మేనత్త ఇంట జరుగుతున్న కార్తీకవ్రతం కార్యక్రమానికి హాజరయ్యారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణంలో ఇరువురూ స్కూటీపై బయలు దేరారు. తక్కెళ్ళపాడు మానస సరోవరం సమీపంలో హైవే ఎక్కేందుకు స్పీడ్‌ బ్రేకర్లు దాటుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన యర్రంశెట్టి శివకోటేశ్వరరావు, షేక్‌ షరీఫ్‌లు వారి పల్సర్‌ బైక్‌తో స్కూటీని ఢీ కొట్టారు.

స్కూటీపై ఉన్న వారు కింద పడి దెబ్బలు తగలడంతో వారిని బెదిరించి రామకృష్ణారావు వద్ద ఉన్న రూ. 4000 రూపాయలు నగదు, సెల్‌ఫోన్‌ లాక్కుని పరారీ అయ్యారు. ఈ సమయంలో సతీష్‌ బైక్‌ నంబరు గుర్తించడంతో పాటు నిందితుణ్ణి పరిశీలించాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌ లో ఉంటున్న సతీష్‌ను విదేశాలకు పంపించే ప్రయత్నంలో పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే విరమించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ చూడడం అలవాటు ఉన్న సతీష్‌కు ప్రెండ్‌ రిక్వెస్ట్‌లో నిందితుణ్ణి గుర్తించాడు. తండ్రికి చూపించడంతో అతనేనని ధృవీకరించాడు. ఈనెల 10వ తేదీన పెదకాకాని పోలీసుస్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటన వివరించాడు. బాధితుడు సతీష్‌ ఇచ్చిన సమాచారం మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన నిందితుడు యర్రంశెట్టి శివకోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని అతను ఉపయోగించిన పల్సర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరొక నిందితుడు షరీఫ్‌ పరారీలో ఉన్నాడు. హైవేలపై చీరీలకు పాల్పడుతున్న నిందితుడు శివకోటేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని సీఐ బి సురేష్‌బాబు తెలిపారు. ఈ కేసును చేధించడంలో సహకరించిన హెడ్‌కానిస్టేబుల్‌ రాజేంద్ర, కానిస్టేబుళ్లు టి శ్యాంసన్, యానాదిలను అభినందించారు.

చదవండి: ఐయామ్‌ వెరీ సారీ..! కత్రినాకైఫ్‌ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top