
కురబలకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు కర్ణాటక వాసులు మృతి
మరో పది మందికి తీవ్ర గాయాలు
కురబలకోట (అన్నమయ్య జిల్లా): వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ టెంపోను ఢీకొట్టి ముగ్గురి ప్రాణాలను బలిగొంది. పదిమందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని బాగేపల్లెకు చెందిన నరసింహారెడ్డి, రామచంద్రప్ప, శివప్ప కుంటుంబాలకు చెందిన 15 మంది తిరుమల దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చెన్నామర్రి వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్ ఒక్కసారిగా వీరు ప్రయాణిస్తున్న ట్రావెలర్ టెంపోను ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో మేఘర్‡్ష(16), చరణ్(17), శ్రావణి(24) అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని 108, పోలీస్ వాహనాల్లో మదనపల్లె ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్ణాటకలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ మంజునాథ కోమాలోకి వెళ్లారు. టెంపోను ఢీకొట్టిన కంటైనర్ లారీతో పాటు డ్రైవర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
చెన్నామర్రి మిట్ట రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, మరో పదిమంది గాయపడడం పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.