
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
శావల్యాపురం: మినీ వాహనం ఆటోను ఢీకొన్న దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన ఇది. వివరాల్లోకి వెళితే, పల్నాడు జిల్లా, శావల్యాపురం మండలం, కారుమంచి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఒకరు గాయపడ్డారు. బాధితులు శావల్యాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం స్వల్పగాయాలైన వ్యక్తిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లాలని పోలీసులు బాధితులకు సూచించారు. దీంతో ఆటోలో డ్రైవర్‌సహా ఎనిమిది మంది వినుకొండకు బయలుదేరారు.
ఈ క్రమంలో కనమర్లపూడి గ్రామ సమీపాన జాతీయ రహదారి మార్గంలో ఆటోను మినీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన బత్తుల బ్రహ్మయ్య(34), బత్తుల నాగ మూర్తమ్మ (48), బత్తుల అంజమ్మ (57) సంఘటన స్థలంలో మృతి చెందారు. బత్తుల ముత్యాలమ్మను వైద్యశాలకు తరలించి వైద్యసేవలు అందిస్తుండగా మృతి చెందింది. బత్తుల యశోదకుమారి పరిస్థితి విషమంగా ఉంది. బత్తుల శ్రీనివాసరావు, బింగి వెంకాయమ్మ, డ్రైవర్ చల్లా రాంబాబులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదానికి కారణమైన మినీ వాహనం బొప్పాయి మొక్కల లోడుతో యర్రగొండపాలెం నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం కందులవారిపాలెం గ్రామానికి బయలుదేరింది. ప్రమాదంలో మినీ వాహనం డ్రైవర్ బిట్రగుంట నరసింహారావు, మొక్కలు తీసుకు వెళుతున్న బర్రిపూడి నరసింహారావు, పాల రేణురెడ్డిలకు గాయాలు కాగా, వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో భారీ వర్షం కురుస్తుండడం గమనార్హం. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.