మదనపల్లె టౌన్ : ‘అయ్యో బిడ్డల్లారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా’ అంటూ ఆ చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అప్పటి వరకు పిల్లల ఆటపాటలతో మురిసిపోయిన వారికి రోడ్డు ప్రమాదం కడుపుకోత మిగిల్చింది. లారీ ఢీకొని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డ విషాదకర సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. ఘటనపై మృతుల కుటుంబీకులు, తాలుకా పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని చీకిలబైలుకు చెందిన శివారెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు. తన ఇద్దరు పిల్లలను అక్కడే చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉగాది పండుగ కోసం గురువారం చీకిలబైలుకు శివారెడ్డి భార్యా పిల్లలతో వచ్చాడు. శుక్రవారం కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు సమీపంలోని బల్తమూరులో ఉంటున్న తన తమ్ముడు శ్రీనివాసులురెడ్డిని చూడటానికి కొడుకు కుశల్‌రెడ్డి(10)ని వెంట తీసుకుని బైకులో వెళ్లాడు. తమ్ముడిని పలకరించి తిరిగి ఇంటికి తన కుమారుడు కుశల్‌రెడ్డితోపాటు తమ్ముడు శ్రీనివాసులురెడ్డి కుమారుడు భువనేశ్వర్‌రెడ్డి(6)ని వెంట తీసుకుని తిరిగి చీకిలబైలుకు బయలుదేరాడు.
స్కూటర్ చీకిలబైలుకు రాగానే తన ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న స్పీడు బ్రేకరు వద్ద స్లో చేయడంతో వెనకనే వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శివారెడ్డి ఒక వైపు, పిల్లలు మరో వైపు కింద పడడంతో.. పిల్లలపైకి లారీ దూసుకెళ్లి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక 50 మీటర్ల దూరం వెళ్లి ఉంటే క్షేమంగా ఇంటికి చేరుకునే వారని, లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. సమాచారం అందిన వెంటనే తాలుకా ఎస్‌ఐ చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


