
పోలవరం నుంచి 5.02 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
వేలేరుపాడులోని ఎద్దుల వాగు వంతెన పైకి చేరిన వరద నీరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద క్రమేపీ పెరుగుతోంది. వారం రోజులుగా సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరం ప్రాజెక్టుకు చేరుతోంది. మహారాష్ట్ర, తెలంగాణలో వర్షాలు ఎక్కువగా పడుతుండటంతో గోదావరి, శబరి నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి గురువారం 2,86,205 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం వరద తీవ్రత ఎక్కువైంది. భద్రాచలంలో నీటి మట్టం 37.20 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు నుంచి 5,02,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
శని, ఆదివారాల్లో కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉంటుందని, శనివారం సాయంత్రానికి 7.50 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ముంపు మండలమైన వేలేరుపాడు, కోయిదా రహదారిపై ఉన్న ఎద్దుల వాగు వంతెన పైకి వరద నీరు చేరింది. రాకపోకలు నిలిచిపోయాయి. అర్ధరాత్రికి వంతెన పూర్తిగా మునిగే పరిస్థితి ఉంది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి.