క్యారీ ఓవర్‌ జలాలపై హక్కు ఉమ్మడి రాష్ట్రానిదే | Right to carry-over waters belongs to Union AP Itself | Sakshi
Sakshi News home page

క్యారీ ఓవర్‌ జలాలపై హక్కు ఉమ్మడి రాష్ట్రానిదే

Feb 7 2021 3:56 AM | Updated on Feb 7 2021 9:14 AM

Right to carry-over waters belongs to Union AP Itself - Sakshi

సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ‘క్యారీ ఓవర్‌’ కింద 150 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌)–1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిందని, విభజన నేపథ్యంలో ఆ జలాలపై అటు తెలంగాణకు.. ఇటు ఏపీకి ప్రత్యేకమైన హక్కులు లేవని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర జల్‌ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం), కృష్ణా బోర్డు ఇదే అంశాన్ని ఎత్తి చూపాయని గుర్తు చేస్తున్నారు. క్యారీ ఓవర్‌ జలాల్లో వాటాపై రెండు రాష్ట్రాలు కేడబ్ల్యూడీటీ–2లో తేల్చుకోవాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. కృష్ణా బోర్డు కూడా శుక్రవారం ఇదే అంశాన్ని పునరుద్ఘాటించడం గమనార్హం. గత నీటి సంవత్సరం(2019–20)లో వాటా కింద వాడుకోని 50 టీఎంసీలను ప్రస్తుత నీటి సంవత్సరం (2020–21)లో కేటాయించాలని జూన్‌ 3న తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌.. కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. దీనిపై ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని, కోటాలో ఉపయోగించుకోని నీటిని క్యారీ ఓవర్‌గా పరిగణించాలని స్పష్టం చేశారు. దాంతో ఈ వ్యవహారాన్ని ఆగస్టు 14న కేంద్ర జల్‌ శక్తి శాఖ దృష్టికి కృష్ణా బోర్డు తీసుకెళ్లింది. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని ఆగస్టు 20న కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆదేశించింది.

ట్రిబ్యునల్‌ తేల్చేదాకా ఏకాభిప్రాయమే శరణ్యం 
ఇరు రాష్ట్రాల వాదనలపై అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ నీటి యాజమాన్య విభాగం (ఐఎంవో) సీఈ విమల్‌ కుమార్‌.. క్యారీ ఓవర్‌ జలాలను ఉమ్మడి ఏపీకే కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిందని తేల్చి చెప్పారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్‌)లో నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల ఎగువ నుంచి దిగువకు వరద రావడంలో జాప్యం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో క్లాజ్‌–8(ఏ) కింద తాగు, సాగు నీటి అవసరాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో క్యారీఓవర్‌ కింద 150 టీఎంసీలను నిల్వ చేసుకోవడానికి ఉమ్మడి ఏపీకి అవకాశం కల్పించిందని ఎత్తిచూపారు. విభజన నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 తీర్పు ప్రకారం క్యారీ ఓవర్‌ జలాలపై ఇరు రాష్ట్రాలకు ప్రత్యేకమైన హక్కులు లేవని, ఈ అంశాన్ని కేడబ్ల్యూడీటీ–2లో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకూ కృష్ణా బోర్డు నేతృత్వంలో క్యారీ ఓవర్‌ జలాలను ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకోవాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించాలని సూచిస్తూ అక్టోబర్‌ 13న కేంద్ర జల్‌ శక్తి శాఖకు నివేదిక ఇచ్చారు. ఆ మేరకు కృష్ణా బోర్డుకు దిశా నిర్దేశం చేస్తూ అక్టోబర్‌ 20న కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆదేశాలిచ్చింది.

ఇరు రాష్ట్రాలకూ నష్టమే 
ఒక నీటి సంవత్సరంలో లభ్యతగా ఉన్న నీటిలో వాటాగా దక్కిన జలాలను అదే నీటి సంవత్సరంలో వాడుకుంటేనే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనకరమని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాటా జలాలను ఉపయోగించుకోకపోతే శ్రీశైలం, సాగర్‌లలో ఆ నీరు నిల్వ ఉంటుందని.. దీని వల్ల ఆ తర్వాత నీటి సంవత్సరంలో ఎగువ నుంచి వరద ప్రవాహం వచ్చినప్పుడు వాటిని ఒడిసి పట్టే అవకాశం కోల్పోతామని ఎత్తిచూపుతున్నారు. ఫలితంగా వరద జలాలు సముద్రం పాలవుతాయని.. ఇది రెండు రాష్ట్రాలకు నష్టం చేకూర్చుతుందని స్పష్టం చేస్తున్నారు. ఒక నీటి సంవత్సరంలో వాడుకోని వాటా జలాలను తర్వాత నీటి సంవత్సరంలో ఉపయోగించుకోవడానికి ఒక రాష్ట్రానికి అవకాశం ఇస్తే.. మరొక రాష్ట్ర హక్కులను హరించడమేనని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకూ క్యారీ ఓవర్‌ జలాలను ఏపీ, తెలంగాణలు 512 : 200 టీఎంసీల నిష్పత్తిలో పంపిణీ చేసుకోవడం మినహా మరొక మార్గం లేదని స్పష్టం చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement