ప్రతి నెలా.. సంక్షేమ పండగ

Rewind 2020: Year Roundup In Visakhapatnam - Sakshi

సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): కాలచక్రం గిర్రున తిరిగింది. పాత స్మృతులను చెరిపేసింది. సుఖదుఃఖాలు.. జయాపజయాలు.. కరోనా కష్టకాలాన్ని.. అన్నింటినీ చరిత్రగతిలో కలిపేసింది. కాంతి రేఖల దిశగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. ప్రభుత్వం చేపడుతున్న దీర్ఘకాల ప్రణాళికలతో విజయ తీరాల దిశగా విశాఖ నగరం తనదైన ముద్రను లిఖించేందుకు సన్నద్ధమౌతోంది.

జనవరి
1- ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడంతో సంస్థ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. 
9 అమ్మ ఒడి పథకంలో భాగంగా జిల్లాలో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 
10 - జీవీఎంసీ పరిధిలో 98 వార్డులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
20 - విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా నిర్ణయిస్తూ రూపొందించిన బిల్లును శాసన సభలో ఆమోదించడంతో.. జిల్లా అంతటా సంబరాలు జరిగాయి. 
29 - బంగ్లాదేశ్‌ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి అక్కడి దళాలకు చిక్కిన ఎనిమిది మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. 

ఫిబ్రవరి
- వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా 
పింఛన్లు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.  
15  - పాత రేషన్‌కార్డుల స్థానంలో జిల్లాలో 11,10,932 మంది లబ్ధిదారులకు బియ్యం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  
18 - జిల్లాలో 1.76 లక్షల మంది వృద్ధులకు ఉచితంగా నేత్ర పరీక్షలు చేసేందుకు  వైఎస్సార్‌ కంటి వెలుగు లో భాగంగా మూడో దశ స్క్రీనింగ్‌ నిర్వహించారు. 
20 - 15 ఏళ్ల తర్వాత సింహాచల దేవస్థానం ట్రస్ట్‌   బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
24  - ఇంటర్‌ ఆపై ఉన్న విద్యనభ్యసిస్తున్న వారి కోసం ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 1,05,709 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. 
26 - నగరంలో ట్రామ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ తయారు చేసే సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించడానికి అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
♦ కార్గో విమాన సర్వీసులను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. 
29  - గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అరకు ఉత్సవాలను ప్రారంభించారు. 

మార్చి
7  - పుష్కరం తర్వాత జీవీఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
19 - జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. మక్కా నుంచి వచ్చిన అల్లిపురం ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా 
సోకింది.  
20  - లైట్‌మెట్రో డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతను యూ ఎంటీసీ దక్కించుకుంది. రూ.5.34 కోట్లకు టెండర్‌ దాఖలు చేయడంతో ప్రభుత్వం ఆ సంస్థను ఖరారు చేసింది. 
23  - కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో లాక్‌డౌన్‌ విధించింది. 

ఏప్రిల్‌ 
- జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జిల్లాలో 2,00,087 మంది విద్యార్థుల కోసం పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కింద రూ.145.28 కోట్లు మంజూరు చేసింది.  
4  - కరోనా వైరస్‌ నియంత్రణకు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో 11.05,640 మందికి ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున అందించింది. 
- కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రగతి భారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.50 లక్షలు విలువ చేసే నిత్యావసరాలను రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అందజేశారు.  
24 - కరోనా కష్టకాలంలో కూడా మహిళా సాధికారత కోసం ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 7.18 లక్షల మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.64.16 కోట్లు జమ చేశారు. 
26  - సింహాచలం వరాహ నృసింహస్వామి చందనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 
28 ఆర్థిక ఇబ్బందులు కారణంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ‘జగనన్న విద్యా దీవెన’ పేరుతో తలపెట్టిన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. 

మే 
- ఎల్‌జీ పాలీమర్స్‌ కంపెనీలో జరిగిన గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 585 మంది అస్వస్థతకు గురయ్యారు. 
8  - ఎల్‌జీ పాలీమర్స్‌ ప్రమాదంలో అస్వస్థతకు గురైన బాధితులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేజీహెచ్‌లో పరామర్శించారు. మృతులతో పాటు బాధితులకు భారీగా నష్ట పరిహారాన్ని ప్రకటించారు.   
22 - కరోనా కారణంగా కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రభుత్వం రీస్టార్ట్‌ ప్యాకేజీని అందించింది. జిల్లాలో ఉన్న సుమారు 10 వేల ఎంఎస్‌ఎంఈలు లబ్ధిపొందాయి. 
26  - కరోనా కష్టకాలంలో పేద అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లకు ప్రభుత్వం రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసింది. 
30  - వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు.

జూన్‌ 
- లాక్‌డౌన్‌ కారణంగా 80 రోజుల పాటు మూతపడిన షాపింగ్‌ మాల్స్‌ ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయి.  
10 - కులవృత్తిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 22,755 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. 
25 - స్వచ్ఛ సర్వేక్షణ్‌–2020కు సంబంధించి చెత్త రహిత నగర ర్యాంకింగ్స్‌లో విశాఖ త్రీ స్టార్‌ను సొంతం చేసుకుంది. 

జూలై 
- అత్యవసర వేళల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు జిల్లాకు కేటాయించిన 72 కొత్త 108, 104 అంబులెన్సులను రాష్ట్ర పర్యా టక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. 
16 - వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తించేలా రూపొందించిన పథకాన్ని జిల్లాలో ప్రారంభించారు. 
26 - కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ను పురస్కరించుకుని బీచ్‌రోడ్డులో విక్టరీ ఎట్‌ సీ స్థూపం వద్ద వీరుల త్యాగాలను స్మరిస్తూ నేవీ అధికారులు నివాళులు అర్పించారు. 
29 - సింహాచలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌’ స్కీమ్‌లో చోటు కల్పిస్తూ రూ.53 కోట్లు నిధులు మంజూరుకు అంగీకారం తెలిపింది.

ఆగస్టు 
-  హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో జరిగిన క్రేన్‌ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 
12 - వైఎస్సార్‌ చేయూత పథకంలో భాగంగా జిల్లాలో 1,94,714 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.18,750 నగదును జమ చేశారు. 
17 - నగర పోలీస్‌ కమిషనర్‌గా మనీష్‌కుమార్‌ సిన్హా బాధ్యతలు 
స్వీకరించారు. 
19 - సీలేరు విద్యుత్తు కాంప్లెక్స్‌లో రూ.510 కోట్ల వ్యయంతో మరో 2 యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 
20 - స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు 9వ ర్యాంకును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. 
♦ పవన్‌కల్యాణ్‌ విరాభిమాని నూతన్‌ నాయుడు ఇంట్లో పనిచేసే దళిత యువకుడికి శిరోముండనం చేయడంతో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన్‌ నాయుడు భార్యతో పాటు వారి అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. 

సెప్టెంబర్‌ 
- గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందజేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన    వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. 
11 - మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 63,476 స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 6,61,317 మహిళా లబ్ధిదారులకు తొలి దఫాగా రూ.459.43 కోట్లు జమ చేశారు. 
19 - దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు నైతిక మద్దతు ప్రకటించారు. అతని కుమారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
20 - కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో మూతపడిన పాఠశాలలు సుదీర్ఘ విరామం తరువాత తెరుచుకున్నాయి. 

అక్టోబర్‌
- గిరిజన రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలను పంపిణీ చేశారు. పాడేరులో రూ.500 కోట్లతో 30 ఎకరాల్లో డాక్టర్‌ వైఎస్సార్‌ గిరిజన బోధనాస్పత్రికి శంకుస్థాపన చేశారు. 
- ‘జగనన్న విద్యా కానుక’ పథకం ద్వారా జిల్లాలో 3,17,202 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్‌లు, యూనిఫారాలు, బూట్లు, సాక్సులు, బెల్టులు ఉచితంగా పంపిణీ చేశారు. 
9  - చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలో భాగంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అమల్లో జీవీఎంసీ నెంబర్‌ వన్‌గా నిలిచింది. 
♦ ప్రపంచంలో మేటైన జూ పార్కుగా రూపుదిద్దుకునేందుకు విశాఖ జంతు ప్రదర్శన శాల ఎంపికైంది. 
11 - రుషికొండ బీచ్‌ను  సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో అంతర్జాతీయ తీరంగా మారి ‘బ్లూఫ్లాగ్‌’ సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకుంది. 
13 - తీవ్ర వాయుగుండంతో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో వీచిన గాలులకు బంగ్లాదేశ్‌కు చెందిన కార్గోషిప్‌ తెన్నేటి పార్కు ప్రాంతంలో ఒడ్డుకు కొట్టుకువచ్చింది. 
16 - బీచ్‌ రోడ్డులో ‘సీ హారియర్‌’ యుద్ద విమాన మ్యూజియం ఏర్పాటుకు వీఎంఆర్‌డీఏ టెండర్లను ఆహ్వానించింది. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. 
18 - వెనుకబడిన ప్రతి సామాజిక వర్గానికీ ప్రభుత్వం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. ఇందులో గవర, మత్స్యకార, నగరాలు, యాత, నాగవంశం కార్పొరేషన్లకు సంబంధించి విశాఖకు చెందిన ఐదుగురికి చైర్‌పర్సన్‌ పదవులు వరించాయి. 
21 - ఆపదల వల్ల కష్టాలపాలైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ బీమా’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 9,65,223 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 
24  - గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూములను కబ్జా చేసి చేసిన నిర్మాణాలను అధికారులు తొలగించి 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. 
29  -  విశాఖ బీచ్‌ రోడ్డు అభివృద్ధి కోసం తొలి విడతలో కోస్టల్‌ బ్యాటరీ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ ప్రపంచ బ్యాంకు నిధులు రూ.116.71 కోట్లు కేటాయించింది. 
30  - విశాఖ పోర్టు ట్రస్ట్‌ ఎంట్రన్స్‌ చానల్, కంటైనర్‌ టెర్మినల్‌ మధ్యలోని జనరల్‌ బెర్త్‌ పక్కనే రూ.77 కోట్లతో స్వదేశీయులకు విదేశీ విహారం కల్పించే అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణం పట్టాలెక్కింది.

నవంబర్‌ 
10  - అచ్యుతాపురంలో 80.10 ఎకరాల్లో జపాన్‌కు చెందిన యూకొహామా గ్రూప్‌లో భాగమైన అలయన్స్‌ టైర్‌ గ్రూప్‌(ఏటీజీ) రూ.1750 కోట్ల పెట్టుబడులతో కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిసింది. 
13  - స్వచ్ఛ విశాఖపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో బీచ్‌ రోడ్డులో ‘వుయ్‌ సపోర్ట్‌ వైజాగ్‌ వాక్‌థాన్‌’ను నిర్వహించారు.  
17 - కోవిడ్‌ నియంత్రణలో జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐసీఎంఆర్‌ సాయంతో బీఎంజే గ్లోబల్‌ హెల్త్‌ అనే సంస్థ చేసిన అధ్యయనంలో విశాఖకు ఈ గుర్తింపు వచ్చింది. 
23 - మహిళలు, బాలికలకు మరింత భద్రత కోసం అభయం ఐవోటీ పరికరాలను ఆటోలకు అమర్చారు. పైలెట్‌ ప్రాజెక్టుగా విశాఖలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
♦ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ సంస్థకు ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, ఐటీ, బిజినెస్‌ పార్క్‌లు, స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం మధురవాడలో 130 ఎకరాలను కేటాయించింది. సంస్థకు విద్యుత్‌  ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
24 - దేశంలోని స్మార్ట్‌ నగరాల అభివృద్ధి జాబితాలో ఒక స్థానం మెరుగుపర్చుకుని టాప్‌–7లోకి దూసుకువచ్చింది. స్మార్ట్‌ సిటీల్లో విశాఖ బెస్ట్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 
25 - చిరు వ్యాపారులకు చేదుడుగా ఉండాలనే ఉద్దేశంతో తలపెట్టిన ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఉన్న 87,527 చిరువ్యాపారులకు రూ.10 వేలు చొప్పున వడ్డీలేని రుణాలు అందించారు.

డిసెంబర్‌ 
4  -  బీచ్‌ రోడ్డులో విక్టరీ ఎట్‌ సీ వద్ద నేవీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. 
11 - టీటీడీ ఆధ్వర్యంలో బీచ్‌ రోడ్డులో కార్తీక సహస్ర దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 
12  - వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న జీవ క్రాంతి పథకాన్ని జిల్లాలో ప్రారంభించారు. 
19  - పర్యాటక రంగంలో పెట్టు్టబడులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దిన టూరిజం పాలసీని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విడుదల చేశారు. 
21  - యువతను ఉత్తేజపరిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నగరంలో వైఎస్సార్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ప్రారంభించారు. విజేతలకు రూ.50 లక్షలు విలువ చేసే బహుమతలు అందజేయనున్న ఈ టోర్నమెంట్‌లో 422 టీమ్‌లు పాల్గొంటున్నాయి. 
22 - ప్రజల భూమికి శాశ్వత హక్కు, రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష’ సర్వే కార్యక్రమాన్ని జిల్లాలో రాజ్యసభ సభ్యుడు 
వి.విజయసాయిరెడ్డి ప్రారంభించారు. 
25 - పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడానికి సంకల్పించిన ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 1,15,933 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top