రెవెన్యూలో క్రమశిక్షణ కొరడా

Revenue Department Higher Officials actions on Illegals - Sakshi

అక్రమాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్షలు..  ఇటీవల 11 మంది తహసీల్దార్లపై వేటు

సర్వీసు నుంచి ఇద్దరు తొలగింపు.. ఐదుగురికి రివర్షన్‌

కఠిన చర్యలతో హడలెత్తిస్తున్న సీసీఎల్‌ఏ

సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖలో అక్రమార్కులపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. విచారణలో తప్పు చేసినట్లు తేలితే భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది తహసీల్దార్లపై ఈ తరహా చర్యలు తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఇద్దరు తహసీల్దార్లను ఏకంగా సర్వీసు నుంచి తొలగించారు. ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ తహసీల్దార్లుగా రివర్షన్‌ ఇచ్చారు. మరొకరికి కంపల్సరీ రిటైర్మెంట్‌ ఇవ్వగా ఇంకో ముగ్గురికి ఇక్రిమెంట్లలో కోత విధించారు. 

భూముల వ్యవహారాల్లో అక్రమాలు చేస్తే..
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల తహసీల్దార్‌ సీహెచ్‌ శ్రీదేవికి నాలుగు రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్‌గా రివర్షన్‌ ఇచ్చారు. 2017లో ఆమె పెద్దపంజాణి మండల తహసీల్దార్‌గా ఉన్నప్పుడు ముత్తుకూరు గ్రామంలో 350 ఎకరాల అటవీ శాఖ భూమిలో ప్రైవేటు వ్యక్తులకు పట్టాలిచ్చారు. అక్కడి నుంచి బదిలీ అయ్యి రిలీవైన తర్వాత రోజు వెబ్‌ ల్యాండ్‌లో ఈ మార్పులు చేయించినట్లు తేలింది.

ఆమెకు సహకరించిన పెద్దపంజాణి వీఆర్వో డి.శ్రీనివాసులను సైతం పూర్తిగా విధుల నుంచి తొలగించారు. వైఎస్సార్‌ జిల్లా వీరపునాయునిపల్లె తహసీల్దార్‌ ఈశ్వరయ్య అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సర్వీసు నుంచి తొలగించారు. 2017లో ఆయన అట్లూరు మండల తహసీల్దార్‌గా ఉన్నప్పుడు వందల ఎకరాల భూముల రికార్డులను తారుమారు చేసినట్లు రుజువైంది.

ఒక వీఆర్వో భార్య పేరు మీద కోట్ల రూపాయల విలువైన భూముల్ని మార్చినట్లు విచారణలో తేలడంతో విదుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ తహసీల్దార్‌ డి.చంద్రశేఖర్‌ను శాశ్వతంగా డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టుకి రివర్షన్‌ చేశారు.  అనంతపురం జిల్లా పుట్లూరు తహసీల్దార్‌ పి.విజయకుమారి, అదే జిల్లాకు చెందిన మరో తహసీల్దార్‌ పీవీ రమణకు రివర్షన్‌ ఇచ్చారు.

ప్రకాశం జిల్లాకు చెందిన తహసీల్దార్‌ డీవీబీ వరకుమార్‌కు సీనియర్‌ అసిస్టెంట్‌గా రివర్షన్‌ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తహసీల్దార్లు టి.రామకృష్ణ, కె.శ్రీని వాసరావు, ఏలూరు జిల్లాకు చెందిన తహసీల్దార్‌ పి రాకడమణికి ఇంక్రిమెంట్లలో కోత పెట్టారు. చితూ ్తరు జిల్లాకు చెందిన మరో తహసీల్దార్‌ నరసింహులకు కంపల్సరీ రిటైర్‌మెంట్‌ ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాల్లో ఒక డిప్యూటీ సర్వేయర్, మరో టైపిస్ట్‌పైనా చర్యలు తీసుకున్నారు. 

గతంలోలాగా కాకుండా..
గతంలో అక్రమాలు బయట పడితే సస్పెండ్‌ చేసి వదిలేసేవారు. దీంతో మళ్లీ పోస్టింగ్‌ తెచ్చుకుని ఏమీ జరగనట్లు పనిచేసేవారు. ఆ అక్రమాలపై తదుపరి విచారణ ఏళ్ల తరబడి కొనసాగేది. చివరికి వాటి నుంచి ఎలాగోలా బయటపడి క్లీన్‌చిట్‌ తెచ్చుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అక్రమాలు నిజమని తేలితే ఊహించని విధంగా చర్య తీసుకుంటుండటంతో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు వణికిపోతున్నారు.

రివర్షన్‌ అనే పదం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో గుబులు రేపుతోంది. పెండింగ్‌లో ఉన్న వి చారణలు త్వరితగతిన పూర్తి చేసేలా తమ శాఖ వి జిలెన్స్‌ విభాగాన్ని సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌ పరుగులు పెట్టిస్తున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు తాజా ఘటనలతో అక్రమాలు అంటేనే ఉలిక్కిపడుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top