సంక్షేమ వీచిక.. ప్రగతి గీతిక | YSR 77th Jayanthi Special Story, YSR Legacy Endures Through Landmark Projects And People-Centric Governance | Sakshi
Sakshi News home page

సంక్షేమ వీచిక.. ప్రగతి గీతిక

Jul 8 2026 8:18 AM | Updated on Jul 8 2026 9:52 AM

Remembering YSR on His Birth Anniversary

నేలతల్లికి జలసిరులందించిన భగీరథుడు.. ఆరుగాలం శ్రమించినా ఉరితాళ్లే దిక్కయిన రైతన్నల అప్పులను ఒక్క సంతకంతో మాఫీ చేసిన రైతు బాంధవుడు.. అనారోగ్యంతో లయ తప్పిన పేద గుండెలకు ఊపిరిలూదిన మహనీయుడు.. ఆసరా లేని వృద్ధులకు భరోసానిచ్చిన పెద్ద కొడుకు.. బడుగు జీవులకు సంక్షేమ రథసారథి.. ప్రతి ఇంటా ప్రగతి కాంతులు నింపిన స్వాప్నికుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. ప్రజలే ప్రాణంగా సాగించిన ప్రయాణంలో దివికేగి 17 ఏళ్లవుతున్నా.. నేటికీ జనం హృదయాల్లో కొలువైన ఆత్మబంధువు. మనసున్న ఆ మహారాజు జయంతి నేడు.  

సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా అభివృద్ధిలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. దేశంలో 70 శాతం ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయ రంగానికి అడుగడుగునా చేదోడువాదోడుగా నిలిచారు. ఉచిత వ్యవసాయ విద్యుత్, జలయజ్ఞం వంటి పథకాలతో అన్నదాతలను ఆదుకున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం తదితర రంగాల్లో చెరగని ముద్ర వేశారు. 

  • జల సిరులు 
    పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు తేవడం, ఎక్కువ శాతం పనుల పూర్తిలో వైఎస్సార్‌దే కీలక పాత్ర. కుడి, ఎడమ ప్రధాన కాలువలను తవ్వించారు. 

  • రూ.500 కోట్లతో తాడిపూడి ఎత్తిపోతల పథకం నిర్మించారు. తద్వారా 16 మండలాల్లోని 2.06 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. 

  • ఇంకా ఆరికిరేవుల, పైడిమెట్ల, బ్రాహ్మణగూడెం, చాగల్లు, కుమారదేవం ఎత్తిపోతల పథకాలు నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరందించారు.

  • ప్రగతి కాంతులు 
    గోదావరి నదిపై నాలుగు వరుసలతో 4.5 కిలోమీటర్ల మేర గామన్‌ బ్రిడ్జి, 14 కిలోమీటర్ల మేర అప్రోచ్‌ రోడ్డును 2006లో నిర్మించారు. దీనివల్ల  విజయవాడ – విశాఖపట్నం మధ్య దూరం 40 కిలోమీటర్ల మేర తగ్గింది. 

  • 2009లో నన్నయ వర్సిటీకి వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారు. 

  • నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ భవనాన్ని రూ.22 కోట్లతో చేపట్టారు. 

  • ాజమహేంద్రవరంలో మురుగు నీటిని శుద్ధి చేసి, గోదావరిలోకి వదిలేందుకు హుకుంపేట సమీపాన సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మించారు. 

  • నిడదవోలులో 2005లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు, బాలాజీనగర్‌లో రూ.1.64 కోట్లతో 500 కిలోలీటర్ల మంచినీటి రిజర్వాయర్‌కు శంకుస్థాపన, రూ.70 లక్షలతో మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణం చేపట్టారు.  

‘ప్రజాప్రస్థానం’ అడుగుజాడలు 
2004 నాటికి అప్పటి చంద్రబాబు పాలనలో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజల కన్నీరు తుడిచేందుకు.. ప్రజాప్రస్థానం పేరుతో నాడు వైఎస్సార్‌ చేపట్టిన పాదయాత్ర రోడ్డు కమ్‌ రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంది. తీవ్ర ఎండలు, వడగాడ్పులతో అస్వస్థతకు గురైన రాజన్న కొంతమూరు వద్ద కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం మధురపూడిలోని తోటల్లో ఆరు రోజుల పాటు వైద్య సేవలు పొందారు. నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్‌ పాదయాత్ర 13 రోజుల పాటు కొనసాగింది.  

సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద రూ.600 కోట్లతో తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం నిర్మించి, బీడువారిన భూముల్లో పంట సిరులు కురిపించారు. 2008 మార్చిలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా పురుషోత్తపట్నం నుంచి తుని వరకూ గోదావరి జలాలను ప్రవహింపజేసి, ఏకంగా 1.50 లక్షల ఎకరాల్లో రెండు పంటలకూ సాగు నీరందించారు.  

రాజన్న దయతోనే.. 
పెయింటింగ్‌ నా వృత్తి. మా కుమారుడు వినోద్‌బాబు జెడ్పీ హై స్కూల్లో పదో తరగతిలో 580 మార్కులతో మొదటి స్థానంలో నిలిచినా ఉన్నత విద్య అందించలేని దుస్థితి. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్‌జీయూకేటీ)ను వైఎస్సార్‌ అప్పట్లో ప్రారంభించారు. ట్రిపుల్‌ ఐటీ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు రావడంతో మా కుమారుడికి 2020లో శ్రీకాకుళంలోని ఆర్‌జీయూకేటీలో సీటు వచ్చింది. బీటెక్‌ పూర్తి చేసి, ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. 
– వినోద్‌బాబుతో తల్లిదండ్రులు బయ్యో వెంకటరత్నం, కనకరత్నం, తాడిమళ్ల, నిడదవోలు మండలం  

నన్ను బతికించిన దేవుడు 
2008లో నా రెండు కాళ్లూ పని చేయలేదు. వెన్నెముక పని చేయక, బ్రెయిన్‌లో పెద్ద సమస్య ఏర్పడింది. పనికి వెళ్లకపోతే పూట గడవని దుస్థితి. అలాంటి పరిస్థితుల్లో నా కుటుంబాన్ని అప్పటి సీఎం వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎంతో ఆదుకుంది. కాకినాడలో బ్రెయిన్‌ సర్జరీ చేయించుకుని, ప్రాణగండం నుంచి బయట పడ్డాను. నన్ను బతికించిన దేవుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. 
– కర్రి పద్దరాజు, ఏపీ త్రయం, పెదపూడి మండలం  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement