
15 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరిపించాలి
కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలి
సర్కారు దౌర్జన్యకాండపై న్యాయ పోరాటం చేస్తాం
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రెండు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే రీపోలింగ్‌ను వైఎస్సార్‌సీపీ బహిష్కరించిందని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం వెల్లడించారు. పులివెందుల వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లతో టీడీపీ అరాచకం సృష్టిస్తే, కేవలం రెండు బూత్‌ల్లోనే రీపోలింగ్ నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
వేల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పులివెందుల ఎన్ని కల్లో అరాచకం సృష్టించారని, ఆధారాలతో సహా అన్ని వివరాలూ ఎన్నికల కమిషన్ ముందుంచినా పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. మొత్తం 15 పోలింగ్ బూత్‌లలోనూ కేంద్ర ప్రభుత్వ బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నామన్నారు.
రెండు బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ చేయడం ద్వారా తాము జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియను జరిపామని చెప్పుకునేందుకు ఎన్నికల కమిషన్ యత్నిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే చంద్రబాబుకు అలవాటుగా మారిందని పేర్కొన్నారు. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామిక స్పూర్తికి విఘాతం కలిగిస్తాయని అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.