అరుదైన పక్షి ‘కలివికోడి’

Rare Bird Kalivi Kodi Found In Lankamala Forest - Sakshi

కడప కల్చరల్‌: ‘కలివి కోడి’.. పిల్లలూ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.. నిజానికి ఇది కోడి కాదు కానీ అరుదైన పక్షి. ప్రపంచంలో ఈ పక్షి అంతరించిపోయిందని అందరూ భావించారు. కానీ ఆ మధ్య మన జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో ఈ పక్షి కనిపించింది. మన జిల్లాకు మరో ప్రత్యేకతను చేకూర్చి పెట్టింది. మరీ ఆ విషయాలు తెలుసుకుందామా!

మన జిల్లాలో అటు శేషాచలం.. ఇటు నల్లమల అడవులు ఉన్నాయి. జిల్లాలోని సిద్దవటం, బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పేర్కొంటారు. ఈ అడవిలో ఎన్నోజాతుల పక్షులు, జంతువులు ఉన్నాయి. ఈ అడవిలోనే కలివికోడి కనిపించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా పెరిగే కలివి పొదల్లో ఉండడంతో దీన్ని కలివి కోడి అంటున్నారు. 1948 నాటికే ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని పక్షిశాస్త్ర నిపుణులు సైతం నిర్ణయించారు.

1985 జనవరి 5న అట్లూరు మండలం రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్నకు ఈ పక్షి కనిపించగా, దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. వారు దాన్ని కలివికోడిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ వెంటనే వచ్చి ఆ పక్షిని పరిశీలించారు. దురదృష్టవశాత్తు ఆ పక్షి ఆయన చేతిలోనే మరణించింది. అప్పటి నుంచి మళ్లీ ఆ పక్షి కనిపిస్తుందేమోనని నేటివరకు వెతుకుతూనే ఉన్నారు. లంకమల అడవుల్లో పలుచోట్ల ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేశారు.

కొన్ని వివరాలు
కలివికోడికి ‘జోర్డాన్‌ కొర్సర్‌’ అని శాస్త్రీయమైన పేరుంది. ఇది పెద్ద సైజు కంజు పక్షిలా పొడవాటి కళ్లతో ఉంటుంది. ముదురు గోధుమరంగు ఈకలతో మెడలో దండలు ధరించినట్లు ముదురు రంగు చారలు ఉంటాయి. ఇది ముళ్ల పొదలతో కూడిన పచ్చిక మైదానాలలో నివసిస్తుంది. రాత్రి వేళ మాత్రమే తిరుగుతుంది. దీని కూత దాదాపు 200 మీటర్ల దాక వినిపిస్తుంది. నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా కలివికోడి కూతను రికార్డు చేయించి దాని గురించి కరపత్రాలు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేయించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top