కష్టంలో జగనన్న అండగా నిలిచారు 

Ramya Mother Comments About CM Jagan Support - Sakshi

కూతురు పోయిన దుఃఖంలో ఉన్న నన్ను చెల్లిలా ఆదరించారు 

ప్రభుత్వం తరఫున అందాల్సిన సాయం త్వరగా అందింది 

ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు 

నిందితుడికి త్వరగా ఉరిశిక్ష పడాలి 

గుంటూరులో హత్యకు గురైన విద్యార్థిని రమ్య తల్లి జ్యోతి 

సాక్షి, అమరావతిబ్యూరో: కన్న కూతురిని కోల్పోయి కష్టాల్లో ఉన్న తనకు జగనన్న అండగా నిలిచి భరోసా ఇచ్చారని ఇటీవల గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య తల్లి జ్యోతి చెప్పారు. గుంటూరులోని తమ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదన్నారు. తన కూతురు హత్యకు గురైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారన్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్‌ చేయడం సంతోషకరమని చెప్పారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కు ఇవ్వడమేకాకుండా మరో రూ.4.5 లక్షల సాయాన్ని తమ బ్యాంకు ఖాతాలో జమచేశారని తెలిపారు.

ఇతర కుటుంబ అవసరాల నిమిత్తం మరికొంత నగదు సాయం అందిందన్నారు. ప్రభుత్వం తరఫున ఇంటి స్థలం, వ్యవసాయ పొలం ఇవ్వడానికి అవసరమైన పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు త్వరగా స్పందించి ఆ పనులు పూర్తిచేస్తున్నారని తెలిపారు. తమ పెద్ద కుమార్తెకు ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సమయంలో తమకు జగనన్న పూర్తి అండగా నిలిచారన్నారు. తమపైన ఒత్తిడి తెచ్చి ఇలా చెప్పిస్తున్నారంటూ బయట దుష్ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ కుటుంబానికి న్యాయం చేశారు కాబట్టే ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. నిందితుడికి త్వరగా ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

నేనున్నానంటూ భరోసా ఇచ్చారు
దుర్ఘటన జరిగిన తర్వాత ఇక నా చెల్లి లేదని నేను మర్చిపోకముందే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీకు నేనున్నానంటూ అండగా నిలిచారని రమ్య సోదరి మౌనిక చెప్పారు. ఆయన బహుశా తనను కూడా చెల్లిగా భావించి ఉంటారని, అందుకే అంత త్వరగా స్పందించారని పేర్కొన్నారు. ఘటన జరిగిన నాలుగు రోజుల్లోపే అందాల్సిన సహాయం మొత్తాన్ని ప్రభుత్వం అందజేసిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు కూడా వెంటవెంటనే స్పందించి తమకు న్యాయం చేశారన్నారు. తమ కుటుంబానికి అండగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రమ్య తండ్రి వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు పూర్తిగా అండగా నిలిచిందని, నిందితుడికి దిశ చట్టం అమలు చేసి త్వరగా శిక్షపడేలా చూడాలని కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top