రామోజీ మార్కు స్మార్ట్‌ బ్లండర్‌! | Sakshi
Sakshi News home page

రామోజీ మార్కు స్మార్ట్‌ బ్లండర్‌!

Published Sat, Nov 25 2023 3:47 AM

Ramoji Mark Smart Blunder - Sakshi

సాక్షి, అమరావతి:  వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు స్మార్ట్‌ మీటర్ల టెండర్‌ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి రివర్స్‌ టెండర్లు కూడా నిర్వహించాకే ఖరారు చేస్తే అదేదో ఘోరమైనట్లుగా ఈనాడు రామోజీ చిత్రీకరిస్తున్నారు. కడప జిల్లా వాసులు అసలు వ్యాపారాలే చేయకూడదన్నట్లుగా  స్మార్ట్‌ మీటర్ల టెండర్‌ దక్కించుకున్న సంస్థపై ఈనాడు పదేపదే విషం గక్కుతోంది. ఈనాడు కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్ధనరెడ్డి, కె.సంతోషరావు స్పష్టం చేశారు.  

కోవిడ్‌లో అధిక ధర.. అందుకే రద్దు 
వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్‌ అందించడం, ప్రమాదాలకు తావు లేకుండా, మీటర్లు కాలిపోకుండా, ట్రాన్స్‌ఫార్మర్ల భద్రతని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ లేదా ఐఆర్‌డీఏ మీటర్లను రక్షణ పరికరాలతో అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు టెండర్‌ రూపొందించిన డిస్కమ్‌లు న్యాయ సమీక్షకు పంపించాయి.

15 రోజుల సలహాలు, అభ్యంతరాలను సేకరించిన అనంతరం ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా డిస్కమ్‌లు టెండర్లను పిలిచాయి. ఎల్‌1 గా నిలిచిన బిడ్డర్‌కు టెండర్‌ అప్పగించాయి. అయితే ఈ ప్రక్రియ కోవిడ్‌ సమయంలో జరిగినందువల్ల సంస్థలు, ఫ్యాక్టరీలు మూతపడి ఉండడం, టెండర్‌ విలువ అధికంగా ఉండటాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ ప్రక్రియను రద్దు చేసింది.  

మళ్లీ పిలవడంతో ఆదా.. 
ధరలు తగ్గించేలా చర్యలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నది అక్షర సత్యమే. రీ టెండరింగ్‌ ద్వారా ధర మొదటి సారి కంటే 15.75% తగ్గింది. ఏర్పాటుకు 27 నెల­లు, నిర్వహణకు 93 నెలలుగా కేంద్ర ప్రభుత్వం వ్య­వధి పెంచింది. దీనివల్ల మీటర్‌ గ్యారంటీ పీరియడ్‌ 10 ఏళ్లకు పెరిగింది. నిర్వహణ సమయం పెరగడం డిస్కమ్‌లకు వ్యయంలో 2 శాతం ఆదా అవుతుంది. షిరిడీ సాయి, అదాని లాంటి పెద్ద సంస్థలు పోటీ పడటం వల్ల ఈ ప్రాజెక్టుకు సరైన ధర వచ్చింది.  

ఇతర రాష్ట్రాలతో పోలికలా?.. హవ్వ! 
స్మార్ట్‌ మీటర్ల విధానాన్ని దేశంలో మొదటిగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కడా వ్యవసాయానికి స్మార్ట్‌ మీటర్లు పెట్టలేదు. వ్యవసాయానికి స్మార్ట్‌ మీటర్లను పట్టణ ప్రాంతాల్లోని స్మార్ట్‌ మీటర్‌ విధానంతో పోల్చడం, ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు చే­య­డం ‘ఈనాడు’ ద్వంద్వ నీతికి నిదర్శనం.

ఏదైనా ఓ వ్యవస్థను మరో సమా­నమైన దానితో పోల్చడానికి అవి రెండూ ఒకే వ్యవస్థలు అయి ఉండాలి కదా? ఆ మాత్రం కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? ఇక రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్‌ మీటర్లకు సంబంధించి రైతులపై బిల్లులు, ట్రూఅప్‌ లాంటి భారమేదీ మోపట్లేదు. రక్షణ పరికరాలతో సహా మొత్తం ఉచితంగానే ప్రభుత్వం అందచేస్తోంది. 

 
Advertisement
 
Advertisement