శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం

Rajampet: Temple Prasad Bananas, Coconuts Feed to Monkeys - Sakshi

ఆలయాల్లో సేకరించిన పండ్లతో వానరాల ఆకలి తీరుస్తున్న చిరు వ్యాపారులు

రాజంపేట టౌన్‌ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. 


ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్‌ గుర్తించాడు. 

పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 

2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్‌లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్‌లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్‌లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్‌ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top