Raghurama Krishnam Raju: దివాలా ముంగిట్లో రఘురామ కంపెనీ

Raghu Rama Krishna Raju Thermal Power Company Bankruptcy In Bankruptcy - Sakshi

జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఇండ్‌ భారత్‌కు వ్యతిరేకంగా తీర్పు

బ్యాంకుల కన్సార్షియానికి రూ.1,383 కోట్లకు పైగా బాకీ 

ఇందులో పంజాబ్‌ నేçషనల్‌ బ్యాంకుకు రూ.327 కోట్ల బకాయి 

దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన పీఎన్‌బీ

తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.872 కోట్లే

దివాలా ప్రక్రియకు ఓకే.. 

సాక్షి, అమరావతి: బ్యాంకులకు రూ.వెయ్యి కోట్లకుపైగా రుణం ఎగవేత కేసులో ఎంపీ రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ కంపెనీ దివాలా ముంగిట నిలిచింది. ఆస్తులను విక్రయించో, కంపెనీని ఏకమొత్తంగా విక్రయించో రుణదాతల అప్పులు తీర్చడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు దివాలా పరిష్కార నిపుణుడిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ దివాలా ప్రక్రియకు అనుమతిస్తూ హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ బెంచ్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దివాలా పరిష్కార నిపుణుడిగా శ్రీకాకుళం వంశీకృష్ణను ని యమించడమే కాకుండా ప్రక్రియకు సంబంధించి న వివరాలను తెలియచేసే ఫారం–2ను మూడు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది.

థర్మల్‌ కేంద్రం పేరుతో...
బొగ్గు ఆధారిత విద్యుత్‌ తయారీ కేంద్రం ఏర్పాటు పేరుతో ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌  వివిధ బ్యాంకుల నుంచి రూ.1,383.07 కోట్ల రుణాలను తీసుకొని చెల్లించకుండా ఎగవేసింది. ఈ రుణాలకు తనఖా రూపంలో చూపించిన ఆస్తులు కేవలం రూ.872 కోట్లు మాత్రమే కావడంతో ఈ మొత్తాన్ని నిరర్థక ఆస్తులుగా ప్రకటించిన బ్యాంకులు తనఖా ఆస్తుల స్వాధీన ప్రక్రియను ప్రారంభించాయి. రూ.327 కోట్ల రుణాలను ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియంలో ఒకటైన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌.. ఇండ్‌ భారత్‌ను దివాలా సంస్థగా ప్రకటించాలంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ వివాదం న్యూఢిల్లీలోని డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌లో ఉన్నందున ఈ పిటిషన్‌ను కొట్టివేయాలన్న ఇండ్‌ భారత్‌ వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు.

ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌–2016 సెక్షన్‌ 13 కింద పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దివాలా ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో తెలియచేసే ఫారం–2ను మూడు రోజుల్లోగా దాఖలు చేయాల్సిందిగా స్పష్టం చేశారు. రుణం ఎగ్గొట్టిన సంస్థపై సీఐఆర్‌పీ కింద తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ ఉత్తర్వుల కాపీలను హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు అందించాలని రిజిస్ట్రీని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. దీంతో ఇండ్‌ భారత్‌ తనఖా పెట్టిన ఆస్తులు బ్యాంకుల పరం కానున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top