పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట

Quality in the construction of poor people houses in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కింద తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాల నాణ్యతలో ఎక్కడా రాజీ పడేందుకు వీల్లేదన్న ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో గృహ నిర్మాణ శాఖ ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. ఇళ్ల నిర్మాణాల్లో వినియోగించే మెటీరియల్‌కు నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రధానంగా సిమెంట్‌ నాణ్యత విషయంలో ఎటువంటి తేడా రాకుండ పటిష్టమైన నాణ్యత పరీక్షలకు మార్గదర్శకాలు జారీ చేసింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు తక్కువ ధరకే నాణ్యమైన సిమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తున్న విషయం తెలిసిందే. ఇందు కోసం గృహ నిర్మాణ శాఖ గ్రామ సచివాలయాలు, మండల స్థాయిల్లో గోదాములను అద్దెకు తీసుకుంది. సిమెంట్, స్టీలు, ఇతర మెటీరియల్‌ను ఆ గోదాముల్లో నిల్వ చేస్తోంది. సిమెంట్‌ను జిల్లాల వారీగా వైఎస్సార్‌ నిర్మాణ పోర్టల్‌ ద్వారా కొనుగోలు చేయాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు చేసే సిమెంట్‌కు తొలుత 98 శాతం మాత్రమే బిల్లు చెల్లించాలని, నాణ్యత పరీక్షలు పూర్తయ్యాకే మిగతా రెండు శాతం చెల్లించాలని స్పష్టం చేసింది. 

మార్గదర్శకాలు ఇలా..
► ప్రతి సంస్థ సరఫరా చేసిన సిమెంట్‌ నుంచి జిల్లా యూనిట్‌గా రెండు గోదాముల నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి (ఏప్రిల్‌–జూన్, జూలై–సెప్టెంబర్, అక్టోబర్‌–డిసెంబర్, జనవరి–మార్చి) నమూనాలను సేకరించాలి. 
► ప్రతి త్రైమాసికంలో వేర్వేరు గోదాముల నుంచి నమూనాలను సేకరించాలి. నమూనాల సేకరణ సమయంలో సిమెంట్‌ కంపెనీల ప్రతినిధిని భాగస్వామ్యం చేయాలి.
► సేకరించిన నమూనాలను ప్రాజెక్టు డైరెక్టర్లు పరీక్షల కోసం తిరుపతిలోని ఐఐటి, ఎస్వీ విశ్వవిద్యాలయం.. తాడేపల్లిగూడెం ఎన్‌ఐటి, హైదరాబాద్‌లోని ఎన్‌సీసీబీఎం, విమ్తా ల్యాబ్స్, బ్యూరో వెరిటాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, భగవతి–అనా–ల్యాబ్స్‌కు పంపాలి. 
► వీటితో పాటు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కాకినాడ జేఎన్‌టీయూ, విజయవాడలోని కేఎల్‌ విశ్వవిద్యాలయం, సిద్ధార్థ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, విజయనగరం, అనంతపురంలోని జేఎన్‌టీయూ ప్రయోగశాలలకు పంపించాలి.
► సిమెంట్‌ నాణ్యతను నిర్ణయించడానికి గోదాముల వద్ద క్షేత్ర స్థాయి పరీక్షలు చేయాలి. సిమెంట్‌లో గట్టి ముద్దలు ఉంటే తిరస్కరించాలి. సిమెంట్‌ను వేళ్లతో రుద్దినప్పుడు సున్నితంగా ఉండాలి. అలాకాకుండా కణికలాగ ఉంటే ఇసుకతో కల్తీ చేసినట్లు భావించాలి. క్షేత్ర స్థాయి తనిఖీల్లో తేడా ఉంటే ఆ సిమెంట్‌ను తిరస్కరించాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top