పప్పు ధాన్యాల కొనుగోళ్లు షురూ

Purchases of pulses started in Rythu Bharosa Centres - Sakshi

ఆర్బీకేల ద్వారా శనగలు, కందులు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఏప్రిల్‌ మొదటి వారం నుంచి పెసలు, మినుముల కొనుగోళ్లు 

సాక్షి, అమరావతి: రబీ సీజన్‌లో రైతులు పండించిన పప్పు ధాన్యాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికే శనగలు, కందుల కొనుగోళ్లు మొదలవగా.. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి పెసలు, మినుములను కొనుగోలు చేసేందుకు మార్క్‌ ఫెడ్‌ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కనీస మద్దతు ధర చెల్లించి రూ.10.47 కోట్ల విలువైన 2,047 టన్నుల శనగల్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా రూ.14 లక్షల విలువైన 22 టన్నుల కందులను ఇప్పటివరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో 1,26,270 టన్నుల శనగలు, 91,475 టన్నుల మినుములు, 19,632 టన్నుల పెసలు కొను గోలు చేసేందుకు అనుమతినిచ్చింది. శనగలకు క్వింటాల్‌ రూ.5,230, పెసలు రూ.7,275,  మినుము, కందులకు రూ.6,300 చొప్పున మద్దతు ధర ప్రకటించింది.   శనగలు క్వింటాల్‌ రూ.4,800 నుంచి రూ.5,000, పెసలు క్వింటాల్‌ రూ.6,500 నుంచి రూ.6,800 వరకు మాత్రమే ధర ఉండటంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ ఇబ్బంది లేకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకోనుంది. 

ఎస్‌ఎంఎస్‌ ద్వారా రైతుకు సమాచారం
పంట నమోదు (ఈ–క్రాప్‌) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ప్రతి రైతు రబీలో సాగు చేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే ప్రాధాన్యత ఇస్తారు. పంట కోత ల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా రైతులకు తెలియజేస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్‌ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్‌ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్‌ కోడ్‌/ఆర్‌ఎఫ్‌ ఐడీ ట్యాగ్‌ వేస్తారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్‌ (ఈ–హస్తాక్షర్‌) అమలు చేస్తున్నారు. నాణ్యత (ఎఫ్‌ఏక్యూ) ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్‌ పార్టీ ఆడిట్‌ చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top