చెరకు రైతులకు ‘ఏటీఎం’లా!

Profits To Farmers With Advanced Sugarcane Juice Machines - Sakshi

యంత్రం ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు

నాబార్డు నుంచి రుణం పొందే అవకాశం

సాక్షి, అమరావతి: పండించిన పంటను రైతే నేరుగా వినియోగదారుడికి అమ్ముకోగలిగితే అధిక ఆదాయం పొందవచ్చు. రాష్ట్రంలో విస్తరిస్తున్న చెరకు రసం వ్యాపారం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 265 మంది వరకు రైతులు తాము పండించిన చెరకు నుంచి రసం తీసి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

రూ.లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ధర ఉన్న అధునాతన చెరకు రసం యంత్రాలు అందుబాటులోకి రావడంతో చిన్న, సన్నకారు రైతులు అనేక మంది ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. చెరకు ధర బాగా పతనమైన దశలో చేపట్టిన ఈ వ్యాపారం లాభసాటిగా ఉందని రైతులు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన రైతు వీరారెడ్డి, నెల్లూరుకు చెందిన మరో రైతు రామమోహన్‌రెడ్డి చెప్పారు. ఈ వ్యాపారం రైతులకు ఏటీఎం తరహాలో నిత్యం ఆదాయాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

నాబార్డు రుణం పొందవచ్చు
నాబార్డ్‌లోని నాబ్‌–కిసాన్‌ విభాగం వ్యక్తుల జీవనోపాధి, ఆదాయ పెంపు కార్యకలాపాలకు రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోలు) ద్వారా రుణం ఇస్తుంది. ఎఫ్‌పీవోలో ఉండే మూలధనానికి ఐదు రెట్ల రుణాన్ని ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇస్తుంది. సక్రమ చెల్లింపుల అనంతరం వడ్డీ రాయితీ కూడా వర్తింప చేస్తుంది. వ్యక్తులకు నేరుగా నాబార్డు రుణం ఇవ్వదని నాబార్డు ఏపీ సీజీఎం సుధీర్‌కుమార్‌ చెప్పారు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ చిరు వ్యాపారులకు 35 శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తోంది. 

యంత్రం ఎలా పని చేస్తుందంటే..
ఆధునిక చెరకు రసం తీసే యంత్రం ఏటీఎం మెషిన్‌ తరహాలో ఉంటుంది. చెరకు ముక్కల్ని ఉంచితే గ్లాస్‌లోకి రసం వస్తుంది. నిమ్మకాయ, అల్లాన్ని కూడా మెషిన్‌లోనే కలిపి ఇవ్వొచ్చు. టన్ను చెరకు నుంచి 500 లీటర్ల వరకు రసాన్ని తీయొచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో లీటర్‌ రూ.60 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. రైతులే ఈ వ్యాపారంలోకి దిగితే దాన్ని రూ.50కి అమ్మినా 500 లీటర్లకు రూ.25 వేల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులు పోగా టన్ను చెరకుకు నికరంగా రూ.17 వేల నుంచి రూ.18 వేలు మిగులుతాయి. ప్రస్తుతం టన్ను చెరకును రూ.7 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు.
చదవండి: ‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ 
ఆవాల సాగు.. లాభాలు బాగు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top