
నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి తీసుకుంటున్న ఇంజినీరింగ్ కాలేజీలు
ఈఏపీసెట్ కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులపై ఆర్థిక భారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులకు అప్పుడే ఆర్థిక భారం మొదలైంది. ఈఏపీసెట్ తొలి దశ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు తరగతులు ప్రారంభమయ్యే రోజే(ఆగస్టు 4న) రూ.10 వేలు ఫీజు కట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు హుకుం జారీ చేశాయి. వాస్తవానికి కాలేజీల బోధన సామర్థ్యాలను పరిశీలించి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులు నిర్ణయిస్తుంటుంది. ఆ ప్రకారమే ఫీజులపై ప్రభుత్వం జీవోలు విడుదల చేయాలి. కానీ, కొత్తగా చేరే విద్యార్థుల నుంచి వివిధ రకాల ఫీజుల పేర్లు చెప్పి కాలేజీలు అదనంగా రూ.10 వేలు వసూలు చేస్తున్నాయి.
అలాగే విద్యార్థుల నుంచి బలవంతంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడం వల్ల తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. అందుకే విద్యార్థుల నుంచి ఏదో రకంగా వసూలు చేయకతప్పట్లేదని కాలేజీల యాజమాన్యాలు చెబుతుండడం గమనార్హం.
సీఎస్‌ఏబీ, ఈఏపీసెట్ మధ్య నలిగిపోతున్న విద్యార్థులు!
ఇదిలా ఉండగా, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌ఐటీల్లో మిగులు సీట్లకు ఎన్‌ఐటీ రూర్కెలా ఆధ్వర్యంలో సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు(సీఎస్‌ఏబీ) నిర్వహిస్తున్న ప్రత్యేక కౌన్సెలింగ్ కంటే ముందే.. ఈఏపీసెట్ రెండో దశ కౌన్సెలింగ్ ముగుస్తుండటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 4న ఈఏపీసెట్ రెండో దశ సీట్లు కేటాయింపు చేయనుంది. 8వ తేదీలోగా విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. రాష్ట్రంలోని కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకుంటున్నాయి. కానీ, సీఎస్‌ఏబీ కౌన్సెలింగ్ ఆగస్టు 19 వరకు కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో ఈఏపీసెట్ రెండో కౌన్సెలింగ్‌లో సీటు పొంది కాలేజీల్లో చేరిన తర్వాత.. సీఎస్‌ఏబీలో సీటు వస్తే విద్యార్థుల వద్ద సర్టిఫికెట్లు ఉండవు. సీటు రద్దు చేసుకోవాలంటే కాలేజీలు అడిగినంత ఇవ్వాలి. లేదంటే జాతీయ విద్యా సంస్థల్లో సీటును వదులుకోవాలి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.