భారీగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు.. తాజాగా పెంచిన కంపెనీలు
బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెంపు
మార్కెట్‌లో ఎమ్మార్పీకి మించి యూరియా, డీఏపీ విక్రయాలు
అన్నదాతల గగ్గోలు
సాక్షి, అమరావతి: ఎరువుల ధరలు మోతమోగిస్తున్నాయి. అదునుకు యూరియా అందక అగచాట్లు పడుతున్న అన్నదాతలకు మిశ్రమ (కాంప్లెక్స్) ఎరువుల ధరల పెరుగుదల గోరుచుట్టుపై రోకలి పోటులా పరిణవిుంచింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు యూరియా, డీఏపీ ఎరువులు దొరకడం లేదు. వాటిని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్న అన్నదాతలకు తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు సైతం పెరగడం భారంగా మారింది.
గతేడాదితో పోలిస్తే కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెరిగాయి. చైనా ఆంక్షల ఫలితంగా సూక్ష్మసేద్యంలో విరివిగా వినియోగించే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ (ప్రత్యేక ఎరువుల) ధరలు 25నుంచి 50 శాతం మేర పెరిగాయి. 2023–24లో 50 కిలోల బస్తా రూ.1,250–1,450 మధ్య ఉన్న మిశ్రమ ఎరువుల ధరలు ప్రస్తుతం రూ.1,450 నుంచి రూ.1,950కు పెరిగాయి.
రబీ సీజన్‌లో రూ.250 కోట్ల భారం
సాధారణంగా రబీ సీజన్‌లో యూరియా, డీఏపీతో పాటు కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. యూరియా మినహా ఎన్‌పీకే ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ పథకం కింద ఆరేళ్లకోసారి రాయితీ వాటాను కేంద్రం నిర్ణయిస్తుంది. కంపెనీలు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు రాయితీ పెంచితే ఆ భారం రైతులపై పడదు. కానీ.. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాయితీలు పెంచకపోవడంతో కంపెనీలు పెంచే భారం పూర్తిగా రైతులపై పడుతోంది.
మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిపదార్థాలపై 18 శాతంగా ఉన్న జీఎస్టీని ఇటీవలే 5 శాతానికి తగ్గించింది. ఆ మేరకు ఉత్పత్తి వ్యయం తగ్గింది. కానీ.. జీఎస్టీ ఫలాలను జేబుల్లో వేసుకుంటున్న కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల తయారీకి ఉపయోగించే ముడిసరకుల ధరలు పెరిగాయన్న సాకుతో ఏటా వీటి ధరలను పెంచేస్తుండటం రైతులకు పెనుభారంగా మారుతోంది.
గతేడాది కాంప్లెక్స్ ఎరువులు 50 కేజీల బస్తాకు రూ.100–150 మేర పెరిగాయి. తాజాగా కంపెనీలు ఆ ధరలను మరోసారి పెంచేశాయి. ఫలితంగా ప్రస్తుత రబీ సీజన్‌లోనే ఎరువుల ధరల పెంపు భారం దాదాపు రూ.250 కోట్లకు పైగా రైతులపై పడుతుందని చెబుతున్నారు.
ప్రత్యేక ఎరువులూ భారమే
సూక్ష్మ సేద్యంలో ఉపయోగించే సూక్ష్మ (డ్రిప్) ఎరువులకు గడ్డుకాలం దాపురించింది. సూక్ష్మ సేద్యానికి ప్రధానంగా మోనో అమ్మోనియం ఫాస్పేట్ (ఎంఏపీ), మోనో పొటాషియం ఫాస్పేట్ (ఎంకేపీ), కాల్షియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, మైక్రో న్యూట్రియెంట్స్ వంటివి వినియోగిస్తారు. వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్‌గా పేర్కొనే వీటిని ప్రత్యేక ఎరువులని పిలుస్తారు. దేశీయంగా వీటి వినియోగం 2.5 లక్షల టన్నులు. వీటిలో 60–65 శాతం రబీలోనే వినియోగిస్తుంటారు. వీటిలో 80 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి అవుతాయి.
ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో కంపెనీలు వీటి ధరలను 25 నుంచి 50 శాతం వరకు పెంచాయి. ప్రధానంగా కిలోకు ఎంఏపీ, ఎంకేపీ ఎరువుల ధరలు రూ.60–80, ఫె–ఈడీడీహెచ్‌ఏ (ఐరన్ చెలేట్) వంటి సూక్ష్మ ఎరువుల ధరలు రూ.220 నుంచి రూ.280కి, జెడ్‌ఎన్–ఏడీటీఏ అనే జింక్ ఎరువుల ధరలు రూ.130–170 మేర పెరిగాయి. ఏటా పెరుగుతున్న ఎరువుల భారం మోయలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.
రైతుల ఆందోళన
దాచేపల్లి: యూరియా కోసం గంటల తరబడి పడిగాపులుపడ్డ రైతులకు అవి దక్కకపోవటంతో శనివారం ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్దకు యూరియా కోసం రైతులు భారీగా తరలిరావడంతో సిబ్బంది కూపన్లు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియాతో పాటు రూ.266 విలువచేసే నానో యూరియా డబ్బా కూడా తీసుకోవాలని సిబ్బంది మెలిక పెట్టారు.
నానో యూరియా డబ్బా తీసుకునేందుకు రైతులు అంగీకరించలేదు. దీంతో సిబ్బంది రైతులకు చెప్పాపెట్టకుండా తాళాలు వేసి వెళ్లిపోయారు. రైతులు మండల వ్యవసాయ శాఖాధికారి కంచర్ల వెంకటేష్‌కి జరిగిన విషయాన్ని వివరించారు. ఆయన సిబ్బందితో మాట్లాడి యూరియా బస్తాలు రైతులకు ఇవ్వాలని సూచించినా సిబ్బంది యార్డుకు రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. చివరకు.. ఏఓ సమక్షంలో యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశారు.


