
తోతాపురికి పెరిగిన ధర
రూ.7కు కొనుగోలు చేస్తామంటున్న ఫ్యాక్టరీలు
రూ.8కు కొనాలని పట్టుబడుతున్న అధికారులు
ర్యాంపు లేకుండా చూడాలని ఫ్యాక్టరీలు..
లేకుంటే ర్యాంపులకు వచ్చే కాయలను స్థానిక ఫ్యాక్టరీలకు మళ్లించాలని అభ్యర్థన
ఇది వైఎస్ జగన్ ప్రభావమేనని అంటున్న రైతులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళ్యం పర్యటనతో మామిడి రైతులకు మంచిరోజులొచ్చాయి. మామిడి ధరలు పైపైకి చూస్తున్నాయి. ప్రధానంగా తోతాపురికి డిమాండ్ పుట్టుకొ చ్చింది. ర్యాంపులతో ఫ్యాక్టరీలు పోటీపడే స్థాయికి చేరుకుంది. ర్యాంపులు లేకుండా చూడాలని ఫ్యాక్టరీలు అధికారులకు నివేదించుకుంటున్నాయి. లేదంటే ర్యాంపులకు వచ్చే కాయలను స్థానిక ఫ్యాక్టరీలకు మళ్లించాలని అభ్యర్థిస్తున్నాయి.
తోతాపురి కేజీ రూ.7లకు కొనుగోలు చేస్తామని ఫ్యాక్టరీలు ముందుకొచ్చాయి. రూ.8కి కొనాలని అధికారులు పట్టుపడుతున్నారు. అయితే, ఇది ముమ్మాటికీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభావమేనని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈసారి పల్ప్ ఫ్యాక్టరీలు, దళారులు ధరలు తగ్గించి మామిడి రైతులను అవస్థలకు గురిచేశారు. కోత సమయం నుంచి ఈ నెల 8 వరకు రైతులు అతలాకుతలమయ్యారు. పంట విక్రయానికి నానా తంటాలు పడ్డారు. వారి గోడు ప్రభుత్వానికి పట్టకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు.
జగన్ వచ్చి వెళ్లాక ధరల పెరుగుదల..
రైతుల కష్టాలను విని వారికి భరోసా ఇచ్చేందుకు ఈ నెల 9న వైఎస్ జగన్ బంగారుపాళ్యంలో పర్యటించారు. రైతుల కాయకష్టం విన్నారు. వారి కన్నీళ్లు తుడిచి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. వైఎస్ జగన్ వచ్చి వెళ్లాక మామిడి ధరలు పెరుగుతున్నాయి. ర్యాంపుల్లో తోతాపురి ఒక్కసారిగా రూ.2 నుంచి రూ.6.50 వరకు పెరిగింది. దీంతో రైతులు కూడా ఫ్యాక్టరీల ర్యాంపుల వద్దకు క్యూ కడుతున్నారు. ర్యాంపు నిర్వాహకులు కొనుగోలు చేసిన కాయలను తమిళనాడులోని క్రిష్ణగిరి, నాసిక్‌కు విక్రయించుకున్నారు.
అక్కడ రూ.8 నుంచి రూ.8.50ల వరకు ధరలు పలకడంతో ర్యాంపులు లాభాలు గడిస్తున్నాయి. ఇక ర్యాంపుల నుంచి జిల్లాలోని ఫ్యాక్టరీలకు కాయలొచ్చేలా పరిశ్రమదారులు అధికారులను పట్టుబడుతున్నారు. ఇదంతా జగన్‌మోహన్‌రెడ్డి చలవేనని.. ఆయన జిల్లాకు వచ్చి వెళ్లాకే తమకు మంచిరోజులు వచ్చాయని రైతులు సంబరపడుతున్నారు.
‘సాక్షి’ కథనంతో అధికారుల స్పందన..
ఇక ‘సాక్షి’ దినపత్రికలో ‘తోతాపురి.. కాస్త ఊపిరి’ పేరుతో శనివారం వార్తా కథనం ప్రచురితమైంది. ఇందులో స్థానిక ఫ్యాక్టరీల్లో పాత ధరలంటూ ప్రస్తావించింది. తోతాపురి కొనుగోలు ధరలను ఫ్యాక్టరీలు రైతులకు చెప్పడంలేదని వివరించింది. దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు.. ఫ్యాక్టరీ నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ చర్చలో ర్యాంపులకు, క్రిష్ణగిరి, నాసిక్‌కు కాయలు వెళ్లకుండా నిలుపుదల చేయాలని కంపెనీల నిర్వాహకులు అధికారులను కోరారు.
లేదంటే ర్యాంపుల నుంచి కాయలను జిల్లాలోని ఫ్యాక్టరీలకు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా కేజీ రూ.7 చొప్పున కొంటామని నిర్వాహకులు స్పష్టంచేశారు. అయితే, అధికారులు మాత్రం రూ.8కు కొనాలని పట్టుబడుతున్నారు. మరో రెండ్రోజుల్లో తోతాపురి రూ.8కు చేరే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘనత అంతా జగన్‌దే..
ఇన్నాళ్లు మా అవస్థలు అన్నీ ఇన్నీ కావు. తోతాపురికి ధరలు లేవ్. వచ్చిన కాడికి రానీ అని కోత కోస్తే... కాయలు అన్‌లోడింగ్ అవుతుందో లేదో అనే బాధ. కోత కాడికి వెళ్తే కూలీలు దొరకరు.. ట్రాక్టర్ చిక్కదు.. ట్రాక్టర్ దొరికి.. కాయలు తోలుకెళ్తే అన్‌లోడింగ్‌కు 5, 6 రోజులు. ఇలా ఎన్నో అవస్థలు పడ్డాం. జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళ్యం వచ్చి అడుగు పెట్టినారో లేదో.. మామిడి రేట్లు పరుగులు పెడుతున్నాయి. ఈరోజు తోతాపురి రూ.7 అంటున్నారు. ఈ క్రెడిట్ అంతా జగన్‌మోహన్‌రెడ్డిదే. – భాస్కర్‌నాయుడు, రైతు, చిత్తూరు