
పుంజుకుంటున్న ధరలు
పలమనేరు: ధరలుంటే సరుకుండదు... సరుకుంటే ధరలుండవు... ఇదీ కొన్నేళ్లుగా చిత్తూరు జిల్లా, పలమనేరు ప్రాంతంలో టమాటా రైతుల దుస్థితి. ఈనెల మొదటివారంలో 14కిలోల బాక్స్ ధర రూ.200 నుంచి రూ.250 దాకా ఉండగా, గడచిన రెండ్రోజుల నుంచి ఆ ధర క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మంగళవారం నాటికి బాక్స్ ధర రూ. 500కు చేరింది.
ప్రస్తుతం బయటి రాష్ట్రాలనుంచి వ్యాపారులు టమాటా కొనుగోలు నిమిత్తం పలమనేరు మార్కెట్‌కు వస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు కోత కోస్తున్న స్థానిక టమాటా తగ్గుతోంది. ఇప్పటికే కోతలు ముగిసిన తోటలు వడిగిపోతున్నాయి. ప్రస్తుతం కోతదశలో ఉన్న తోటలకు గిరాకీ తగిలే అవకాశాలున్నట్టు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
బయటి రాష్ట్రాల్లో తగ్గిన పంట
బయటి రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రల్లో టమాట పంట తగ్గింది. కర్ణాటకలో వైరస్ కారణంగా పంట దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో డిమాండ్ పెరగడంతో పలమనేరు టమాటాధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో సరుకు లేనందున ఈ రెండు వారాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.