నాటుకోడికి ఫుల్‌ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం!

Price Of Natu Kodi Chicken Meat Is Increasing Day By Day - Sakshi

గూడూరు(తిరుపతి జిల్లా): మాంసంప్రియుల ట్రెండ్‌ మారింది. మటన్‌ కొనే స్థోమత లేని వారంతా ఆరోగ్యాన్ని, అంతకుమించి రుచికి ప్రాధాన్యతనిస్తూ నాటుకోడి వైపు పరుగులు తీస్తున్నారు. బ్రాయిలర్‌ కోళ్ల మాంసంకంటే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నాటుకోళ్ల మాంసం రుచిగా ఉండటంతో కాస్త ధర ఎక్కువైనా ఎక్కడెక్కడ దొరుకుతాయా అని రెక్కలు కట్టుకొని తిరుగుతున్నారు.

ఈ మార్పుతో నాటుకోళ్ల పెంపకం సైతం అధికమైంది. పల్లెల్లో అధికంగా దొరికే నాటుకోళ్లను కొందరు అదేపనిగా కొనుగోలు చేసి, ఆదివారం రోజు పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక పాత బస్టాండ్‌ ప్రాంతంలోని ద్రైపది కాంప్లెక్స్‌ ప్రాంతం ఆదివారం నాటుకోళ్ల సంతను తలపిస్తోంది.

ఒకప్పుడు పల్లెల్లో నాటు కోళ్లను పెంచుకుని, పండుక్కో పబ్బానికో కోసుకుని ఇంటిల్లిపాదీ సంతోషంగా గడిపేవారు. కాల క్రమంలో వాటిని పెంచడంతోపాటు ఇతర ఇబ్బందుల నేపథ్యంలో పెంచేవాళ్లు తగ్గుతూ వచ్చారు. ఈ కారణంగానే చిన్న చిన్న పల్లెల్లోనూ చికెన్‌ సెంటర్లు పుట్టగొడుల్లా పుట్టుకొచ్చాయి. అయితే నాటుకోడి రుచి తెలిసిన పల్లె జనానికి బ్రాయిలర్‌ కోడి రుచించలేదు.

ఫ్రీజర్లలో నిల్వ చేస్తుండటం.. చెన్నై నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి కిలో రూ.99 బోర్డులు పెడుతుండటంతో ప్రజల్లో అనుమానం అధికమైంది. ఎందుకొచ్చిన గొడవ అని.. నాటుకోడి తింటే పోలా అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అంతెందుకు.. హోటళ్లలోనూ నాటుకోడి, రాగి సంగటి బోర్డులు చూస్తే వాటికి పెరిగిన డిమాండ్‌ ఇట్టే అర్థమవుతోంది.

క్రమంగా పెరుగుతున్న పెంపకం 
మారిన మాంసం ప్రియుల అభిరుచికి అనుగుణంగా నాటుకోళ్లకు గిరాకీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వాటి పెంపకం కూడా అధికమైంది. కొందరు వ్యాపారులు పల్లెలకు వెళ్లి నాటుకోళ్లను కొనుగోలు చేసి తీసుకొచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఇక చాలాచోట్ల నాటుకోళ్లను షెడ్లలోనూ పెంచుతున్నారు. వీటిలోనూ రకాలు ఉండటంతో, అందుకు అనుగుణంగా ధర ఉంటోంది.

దాదాపుగా మటన్‌ ధరకు సరితూగుతూ... 
నాటు కోడి మాంసం దాదాపుగా మటన్‌ ధరకు సరితూగుతోంది. మటన్‌ ధర కిలో రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది. ఇదే స్థాయిలో ఒకటిన్నర కిలో బరువున్న నాటుకోడి ధర రూ.700 వరకు ఉంటోంది. వ్యర్థాలన్నీ పోనూ సుమారు కిలో మాంసం ఇంటికి చేరుతుంది. అయితే నాటుకోడి అయితే, ఎలాంటి ఆలోచన లేకుండా ఇంటికి తీసుకెళ్లొచ్చు. అదే మటన్‌ అయితే, ఏది అంటగట్టారోననే అనుమానం తిన్నా తీరదు. ఇంకేముంది.. నాటు, నాటు పాటను గుర్తుకు తెచ్చుకొని ఎంచక్కా లొట్టలేసుకుంటూ నాటుకోడిని ఆరగించేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం విశేషం.

నాటుకోళ్లకు డిమాండ్‌ 
నేను బేల్దారి పనిచేస్తుంటా.. ఆదివారం మాత్రం నాటు కోళ్లు తీసుకొచ్చి అమ్ముతుంటా. ఒక్కో రోజు వెయ్యి వరకూ మిగులుతుంది. వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. పల్లెటూళ్లలో పెరిగిన కోళ్లు కావడంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లు చేస్తుంటారు. 
– రమేష్, గూడూరు

ఆ రుచే వేరబ్బా 
బ్రాయిలర్‌ కోడి మాంసం తిన్నట్టే ఉండదు. ఆదివారం ముక్క లేనిదే ముద్ద దిగదు. మటన్‌ తెచ్చుకుందామంటే ఆ ధర వింటేనే అమ్మో అనిపిస్తుంది. అందుకే నాటుకోడి ఎక్కడ దొరుకుందా అని చూస్తుంటా. రాగి సంగటి కాంబినేషన్‌ ఉండనే ఉంది. ఆ టేస్టే వేరు. 
– శ్రీనివాసులురెడ్డి, గూడూరు
చదవండి: రూమ్‌కు తీసుకెళ్లి రోల్డ్‌గోల్డ్‌ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి..  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top