రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళ సై, సీఎం కేసీఆర్‌

President Murmu Southern Sojourn Visit Hyderabad Day 1 Updates - Sakshi

Updates:

05:00PM
రాష్ట్రపతి  ద్రౌపతి ముర్ము  ఐదు రోజుల శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు.  దీనిలో భాగంగా ప్రత్యేక విమానంలో హకీంపేటకు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు వచ్చిన  రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళ సై, సీఎం కేసీఆర్‌లు స్వాగతం పలికారు. 

TIME: 02.00PM
శ్రీశైలం మల్లికార్జున స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రాష్ట్రపతికి అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉన్నారు. నంది సర్కిల్‌ వద్ద టూరిజం ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో రూ. 43 కోట్లతో చేపట్టిన ప్రసాద్‌ ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు.

TIME: 01.30PM
భ్రమరాంబ గెస్ట్‌హౌస్ నుంచి మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవి దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా స్వాగతం పలికారు.

TIME: 12.30PM
సున్నిపెంట హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన సాక్షి గణపతి ఆలయానికి బయల్దేరి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం భ్రమరాంబిక గెస్ట్‌హౌజ్‌కు వెళ్లారు. కొద్ది సేపు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబిక దేవికి కుంకుమార్చన, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ’ప్రసాద్‌’ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. 

TIME: 12.00PM
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సున్నిపెంట హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఘన స్వాగతం పలికారు.

భారీ భద్రత
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో  శ్రీశైలంలో అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే శ్రీశైలంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు.  ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలు రద్దు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత దర్శనాలు యధాతథంగా నిర్వహించనున్నారు. ద్రౌపతి ముర్ము పర్యటించే ప్రదేశాల్లో దుకాణాలు మూసివేశారు. శ్రీశైలం టోల్ గేట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదకు వాహనాలు మళ్లిస్తున్నారు.

సాక్షి, కర్నూలు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఉదయం శ్రీశైలం దేవస్థానాన్ని రాష్ట్రపతి దర్శించుకుంటారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ’ప్రసాద్‌’ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూల్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు వస్తారు. బొల్లారం వార్‌ మెమోరియల్‌లో అమరజవాన్లకు నివాళులు అర్పించి రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాత్రికి రాజ్‌భవన్‌ విందులో పాల్గొంటారు. 

చదవండి: రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్‌.. ప్రధానితో భేటీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top