మళ్లీ ‘షాక్‌’! | Power distribution companies have sent proposals to APERC for increasing electricity tariffs | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘షాక్‌’!

Jul 8 2025 4:00 AM | Updated on Jul 8 2025 4:00 AM

Power distribution companies have sent proposals to APERC for increasing electricity tariffs

రాష్ట్ర ప్రజలపై రూ.3,629.87 కోట్ల విద్యుత్‌ చార్జీల పిడుగు! 

ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదనలు పంపిన విద్యుత్‌ పంపిణీ సంస్థలు

కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కాలానికి సర్దుబాటు 

ఇప్పటికే రూ.15,485 కోట్లకుపైగా భారాన్ని మోపిన చంద్రబాబు సర్కారు 

అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం.. ఇంకా తగ్గిస్తామన్న బాబు 

మాట తప్పి ఏకంగా రూ.19,115.23 కోట్ల విద్యుత్‌ చార్జీల బాదుడు! 

సూపర్‌ సిక్స్‌లు అమలు చేయలేక.. సంపద సృష్టించలేక అడ్డదారిలో వసూళ్లు

సాక్షి, అమరావతి: నమ్మించి గొంతు కోయడమంటే ఇదేనేమో..! ‘మేం అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం... ఇంకా తగ్గిస్తాం..’ అంటూ ఎన్నికల ముందు ప్రతి సభలోనూ అరిచి మరీ చెప్పారు చంద్రబాబు! కానీ అధికారంలోకి రాగానే ఆ హామీని గాలికొదిలేశారు. చార్జీలు పెంచం అని నేనెప్పుడు చెప్పానంటూ  నిస్సిగ్గుగా మాట మార్చేశారు. ఇప్పటికే ఏడాదిలోనే ఏకంగా రూ.15,485 కోట్లకుపైగా విద్యుత్‌ చార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపారు. అయినా ఆయన శాంతించడం లేదు. 

రెండో ఏడాదిలో అడుగు పెడుతూనే మరోసారి జనం నెత్తిన చార్జీల పిడుగు వేస్తున్నారు. ఈసారి మరింత భారీగా వసూలుకు అనుమతి కోరుతూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్‌) ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి సోమవారం ప్రతిపాదనలు సమర్పించాయి. ఓవైపు ‘సూపర్‌సిక్స్‌’ అంటూ హామీలిచ్చి వాటిలో ఒక్కటీ అమలు చేయకుండా ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు ఇలా విద్యుత్‌ చార్జీల పేరుతో వారిని దోచేస్తోంది!! 

అవసరం లేకున్నా అడ్డదారిలో వసూలు.. 
2024–25 ఆర్థిక సంవత్సరానికి.. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి సంబంధించి ఇంధనం, విద్యుత్‌ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) రూ.2,376.94 కోట్లుగా డిస్కంలు లెక్కగట్టాయి. దీన్ని వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.40 చొప్పున విధించి వసూలు చేయటాన్ని అడ్డదారిలో గతేడాదిలోనే కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. 

అంతేకాదు అవసరం లేకపోయినా ఈ ఏడాది మార్చి వరకూ రూ.2,787.19 కోట్లు ఇప్పటికే జనం నుంచి లాగేశారు. అంటే రూ.410.25 కోట్లు ఎక్కువ వసూలు చేసేశారు. అయితే అది కూడా సరిపోనట్లుంది.. మరో రూ.842.68 కోట్లు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అంటే మొత్తం రూ.3,629.87 కోట్ల మేర భారాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం మోపుతోంది.  

వస్తూనే షాక్‌లు మొదలు.. 
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే విద్యుత్‌ చార్జీలను పెంచడం మొదలుపెట్టింది. గతేడాది చివరి నుంచే అంటే నవంబర్‌ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. దీంతో వినియోగదారులకు కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న విద్యుత్‌ బిల్లులపై ప్రజలు మండిపడుతున్నా, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు సరికదా చార్జీల భారం వేస్తూనే ఉంది. దీంతో వినియోగించిన  విద్యుత్‌కు రెట్టింపు అదనపు చార్జీలు పడుతున్నాయి. 

అంతంత బిల్లులు కట్టలేక జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు బిల్లులు కట్టలేమంటూ మండిపడుతున్నారు. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్నా మరోసారి చార్జీలు వసూలు చేసేందుకే కూటమి ప్రభుత్వం మొగ్గు చూపించింది. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్ర ప్రజలపై రూ.19,115.23 కోట్ల చార్జీల భారాన్ని మోపినట్లైంది. 

సంపద సృష్టిస్తాం అని పదేపదే చెప్పిన చంద్రబాబు, కూటమి నేతలు.. ఇలా తమ దగ్గర డబ్బులు లాక్కుని సృష్టిస్తారని తెలుసుకోలేకపోయామని జనం గగ్గోలు పెడుతున్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు అంటే విద్యుత్‌ చార్జీలను డబుల్‌ చేయడమా బాబూ..? అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

బాబు పాలనంటే ఇంతే..! 
చంద్రబాబు పాలనలో అటు ప్రజలను, ఇటు విద్యుత్‌ సంస్థలను దోపిడీ చేయడం పరిపాటిగా మారింది. గతంలో చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్‌ను యూనిట్‌కు ఏకంగా రూ.6.99, పవన విద్యుత్‌కు రూ.4.84 చెల్లించి కొనుగోలు చేశారు. చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోయే నాటికి విద్యుత్‌ సరఫరా ధర సోలార్‌ రూ.5.90, పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.4.63కి చేరింది. నిజానికి అప్పట్లో సోలార్‌ యూనిట్‌ రూ.2.44కు, పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.2.43తో ఇతర రాష్ట్రాల్లో ఒప్పందాలు జరిగాయి. 

చంద్రబాబు నిర్వాకాల వల్ల డిస్కంలు ఏటా రూ.3,500 కోట్లు చొప్పున దశాబ్దాల పాటు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ), నిర్లక్ష్యం కారణంగా 2014–19 మధ్య విద్యుత్‌ సంస్థలు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాయి. విద్యుత్‌ సంస్థల అప్పులు, బకాయిల భారం 2014 మార్చి నాటికి రూ.29,551 కోట్లు ఉంటే, చంద్రబాబు దిగిపోయే (2019 మార్చి 31) నాటికి రూ.86,215 కోట్లకు పెరిగింది. 

అంటే ఏకంగా రూ.56,663 కోట్లకు ఎగబాకింది. డిస్కంల వార్షిక ఖర్చులకు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా టీడీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించలేదు. దీంతో ఐదేళ్ల టీడీపీ హయాంలో డిస్కంల నష్టాలు రూ.6,625.88 కోట్ల నుంచి రూ.28,715 కోట్లకు ఎగబాకాయి. 

జగన్‌ పాలనే బాగుంది... 
ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారాన్ని తగ్గించడంతోపాటు గాడి తప్పిన విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేసింది. నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పానికి అనుగుణంగా వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్‌ సరఫరా అందిస్తూ, అందుకుగానూ డిస్కంలకు దాదాపు రూ.50 వేల కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించింది. ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్‌ వినియోగదారులకు నెలకు రూ.200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించింది. 

ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున అందిస్తూ యూనిట్‌కు రూ.3.50 సబ్సిడీని భరించింది. 2,809 ఫీడర్లను బలోపేతం చేసి అదనపు సామర్ధ్యం కల్పించడం ద్వారా మొత్తం 6,663 ఫీడర్లతో పగటిపూట వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందచేసింది. వ్యవసాయ రంగానికి వచ్చే 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ నిరాటంకంగా అందించాలనే సంకల్పంతో అడుగులు వేసింది. ఇందుకోసమే  ఏటా 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను అత్యంత చౌకగా యూనిట్‌ కేవలం రూ.2.49 ధరతో సరఫరా చేసేలా, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు లేకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 

సామాన్య ప్రజలు, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో ముందుచూపుతో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల స్థాపనకూ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విశాఖలో 2023లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌(జీఐఎస్‌)లో ఏకంగా రూ.8,19,815 కోట్లతో 25 ఇంధన రంగ ఒప్పందాలతో చరిత్ర సృష్టించింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వంలో అన్నీ తారుమారవుతున్నాయి. ప్రజల నెత్తిన విద్యుత్‌ చార్జీల భారాలు పిడుగుల్లా పడుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement