మిరపకాయ టపా పేరిట పోస్టల్‌ కవర్‌ విడుదల | Sakshi
Sakshi News home page

అల్లూరి విప్లవ పంథాకు వందేళ్లు... మిరపకాయ టపా పేరిట పోస్టల్‌ కవర్‌ విడుదల

Published Fri, May 6 2022 11:09 AM

Post Office Release Postal Envelope Chili Post Used By Alluri Sitaramaraj - Sakshi

రాజవొమ్మంగి: విప్లవ వీరుడు, మన్యందొర అల్లూరి సీతారామరాజు ఉపయోగించిన ‘‘మిరపకాయ టపా’’ పేరిట తపాలా శాఖ శుక్రవారం రాజవొమ్మంగిలో తపాలా కవర్‌ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ తరహా కార్యక్రమం ఆయన పాదముద్రలు పడిన ప్రాంతాలైన రంపచోడవరం, అడ్డతీగలలో పూర్తికాగా, ఇప్పుడు రాజవొమ్మంగి వంతు వచ్చింది. తాను వస్తున్నాను కాసుకోండి ఖబడ్దార్‌ (జాగ్రత్తపడు) అంటూ.. ప్రాణనష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజు మిరపకాయ టపా పంపేవారట.

అలా ఓ వైపు బ్రిటీష్‌ సేనలను జాగృతం చేస్తూనే, మరోవైపు ఉరుములేని మెరుపులా వచ్చి వాలిపోలియేవారని చెబుతారు. తాను ఎప్పుడు, ఎలా ఎక్కడకు వస్తున్నది, ఏం చేయబోతుంది, లేఖ రాసి బాణానికి గుచ్చి, దాంతో పాటే ఎర్ర మిరపకాయల గుత్తి కట్టి వదిలేవారట. ఆ విధంగా వచ్చిన రామబాణాన్ని చూసి ముష్కరులకు నిద్రపట్టేది కాదని, అప్పటి సాయుధ పోరులో అల్లూరి సీతారామరాజు చూపిన ప్రతిభా పాటవాలను నేటికీ గిరిజనులు కథలుగా చెప్పుకుంటారు.

ఆ మహానుభావుని ఉద్యమాల పంథా నూరేళ్ల పండగను జరిపే బరువు బాధ్యతలను తపాలా శాఖ తన భజస్కంధాలపై వేసుకుంది. స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది అసువులుబాయగా, మన్యంలో గిరిజనుల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన అల్లూరికి పరిపరి విధాలుగా ఆ శాఖ నివాళులర్పిస్తోంది. ఈ కార్యక్రమంలో సాధారణ పోస్టుమన్‌ నుంచి పోస్ట్‌మన్‌ జనరల్‌ వరకు పాల్గొంటూ అల్లూరి స్ఫూర్తి నేటి తరం యువతకు ఎంతో అవసరం అని చాటి చెబుతోంది.  

హాజరు కానున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. 
మిరపకాయ టపా పేరిట రాజవొమ్మంగి జయలక్ష్మి థియేటర్‌లో నిర్వహించే అల్లూరి ఉద్యమ శతజయంతి వేడుకలకు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్, అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు,  పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ (విశాఖపట్నం) ముత్యాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.  

(చదవండి: అటవీ వనం కన్నీరు..గొడ్డలి వేటుకు కనుమరుగవుతున్న పచ్చదనం)

Advertisement

తప్పక చదవండి

Advertisement