
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో గంజాయి వ్యాపారం స్వైర విహారం చేస్తోంది. అక్రమ రవాణా, నిల్వ, వినియోగం వంటి కార్యకలాపాలు వెలుగు చూస్తుండడం.. పోలీసుల నిఘా లోపాలను బయటపెడుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ వద్ద వెలుగు చూసిన డబుల్ మర్డర్ కేసు.. గంజాయి బ్యాచ్ పనేనని నిర్ధారణ అయ్యింది.

మంగళవారం ఉదయం.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై నెత్తురు మరకలు, మూడు జతల చెప్పులు ఉండడం చూసిన స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంతపేట పోలీసులు అనుమానంతో నదిలో గత ఈతగాళ్లను దింపి రెండు మృతదేహాలను వెలికి తీయించారు. అయితే అక్కడి సీసీటీవీ ఫుటేజీలు పని చేయకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టమనే భావించారంతా. దీంతో.. ఎస్పీ అజితా ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలించాయి.

ఈ తరుణంలో.. కందుకూరు వద్ద బుధవారం ఉదయం నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకులిద్దరూ గంజాయ్ బ్యాచ్‌గా గుర్తించారు. అడిగితే నగదు ఇవ్వలేదని కోపంతో ఇద్దరిని హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలతో పాటు నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.