పోలీస్‌ యంత్రాంగం మరింత పటిష్టం

Police force is further strengthened in AP - Sakshi

14 డిజాస్టర్, 36 ఎమర్జెన్సీ రెస్సాన్స్‌ వాహనాలకు సీఎం జగన్‌ శ్రీకారం 

ఈ వాహనాలతో ఆ శాఖ సమర్ధత మరింత పెంపు 

కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఘటనా స్థలిని ఈ వాహనాల ద్వారా వీక్షించొచ్చు

త్వరలో 700 దిశ వాహనాలు కూడా..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ యంత్రాంగం మరింత పటిష్టమవుతోందని, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సమర్థవంతంగా పనిచేసే పరికరాలను అందిపుచ్చుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఏపీ అగి్నమాపక, విపత్తుల నిర్వహణ శాఖతోపాటు పోలీస్‌ శాఖకు సమకూర్చిన డిజాస్టర్‌ రెస్సాన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వాహనాలను సీఎం గురువారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌ గ్రౌండ్‌లోని వాహనాలను ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో జెండా ఊపి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని పోలీస్‌ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు అవసరమైన పరికరాలున్న ఈ ప్రత్యేక వాహనాలను సమకూర్చుకోవడం అంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మరింతగా పటిష్టపర్చుకోవడమేనని అన్నారు. ఈ వాహనాలు కచ్చితంగా పోలీస్‌ సమర్థతను మరింతగా పెంచుతాయని.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎంతో తోడ్పడతాయన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ టెక్నాలజీ సహాయపడుతుందన్నారు. అలాగే, రెండు రకాల వాహనాలను ప్రారంభించామని.. 14 డిజాస్టర్‌ రెస్పాన్స్, 36 రెస్క్యూ వాహనాలు అందించామన్నారు. అగి్నప్రమాదాల్లాంటి ఘటనల్లో అపాయంలో ఉన్న వారిని రక్షించడానికి వీలుగా వీటిని తీర్చిదిద్దారన్నారు.

ముంబై తర్వాత ఏపీకే ప్రత్యేక వాహనాలు
డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ వాహనాలు దేశంలో ముంబై తర్వాత మన రాష్ట్రంలోనే అందుబాటులోకి తెచ్చామన్నారు. విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఈ వాహనాలను అందించిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతోనే ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రమాదాలను ఆపలేకపోయినా ఈ వాహనాల ద్వారా ప్రాణనష్టాన్ని నియంత్రించగలమన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వేస్‌ డీజీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీ పీవీ సునీల్‌కుమార్‌ ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

ఒక్కో పోలీస్‌ యూనిట్‌కు 2 వాహనాలు.. 
రాష్ట్రంలోని 18 పోలీస్‌ యూనిట్లలో ఒక్కో యూనిట్‌కు రెండేసి ప్రత్యేక వాహనాలను అప్పగిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. రేడియో పరికరాలు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్స్, నెట్‌వర్క్‌ వీడియో రికార్డింగ్‌ సహా పలు సదుపాయాలు వీటిల్లో ఉన్నాయన్నారు. ఒక్కో వాహనంలో 10 మంది సిబ్బందిని ఘటనా స్థలానికి పంపే అవకాశం ఉందన్నారు. వీటికోసం మొత్తం 92 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ వాహనాల ద్వారా ఘటనా స్థలంలో ఏం జరుగుతుందో నేరుగా కంట్రోల్‌ రూమ్‌లో చూసే అవకాశం ఉంటుందన్నారు. 

త్వరలో దిశ వాహనాలు కూడా.. 
దిశ బిల్లును సమర్థవంతంగా అమలుచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కూడా సీఎం జగన్‌ చెప్పారు. త్వరలో దాదాపు 700 స్కూటీలను దిశ పోలీస్‌స్టేషన్‌ల కోసం ప్రారంభించనున్నామన్నారు. కొత్త సంవత్సరంలోను ‘ఆల్‌ ద బెస్ట్‌ టు పోలీసు డిపార్ట్‌మెంట్‌’ అంటూ ముఖ్యమంత్రి ఆ శాఖకు శుభాకాంక్షలు చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top