నాకు ఇన్ఫోసిస్‌లో నెలకు రూ.1 లక్ష జీతం వస్తుంది! | Police Constable Marriage Fraud Woman Escapes With Gold And Cash | Sakshi
Sakshi News home page

నాకు ఇన్ఫోసిస్‌లో నెలకు రూ.1 లక్ష జీతం వస్తుంది!

Jul 4 2026 12:58 PM | Updated on Jul 4 2026 1:42 PM

Police Constable Marriage Fraud Woman Escapes With Gold And Cash

మంగళగిరి టౌన్‌: ఓ కిలాడీ లేడీ తనకు పెళ్లి కాలేదంటూ మాయమాటలతో నమ్మించి, వివాహం చేసుకుని అనంతరం భారీగా నగలు, డబ్బు దోచుకుని పరారైన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. కిలాడీ వలలో పడి మోసపోయిన ఓ పోలీస్‌ శుక్రవారం మంగళగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణం ఎల్‌బీ నగర్‌లో నివాసముంటున్న సతీష్‌ 2013 బ్యాచ్‌కు చెందిన 16వ బెటాలియన్‌ ఏపీఎస్‌పీ కానిస్టేబుల్‌. ప్రస్తుతం విశాఖపట్నంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 28వ తేదీ జయశ్రీ పాండా అనే మహిళ సతీష్‌కు ఫోన్‌ చేసి తన వ్యక్తిగత సమస్యకు సంబంధించి డీజీపీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు గురించి అడిగింది.

 ప్రస్తుతం తాను అక్కడ పనిచేయడం లేదని, సంబంధిత అధికారులను సంప్రదించాలని సతీష్‌ సూచించాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం జయశ్రీపాండా తన ప్లాన్‌ను అమల్లోకి తెచ్చింది. తనకు వివాహం కాలేదని, కుటుంబ సమస్యలు లేవని సతీష్‌ను నమ్మించింది. తన కుటుంబం నుంచి వచ్చే ఆస్తులు, ఇళ్లు, బంగారం ఉన్నాయని, ఇన్ఫోసిస్‌లో లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం చేస్తున్నానని సతీష్‌కు చెప్పింది. ప్రస్తుతం ఐబీఎం కంపెనీలో ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీకి ఎంపికైనట్లు నమ్మబలికి, తనను వివాహం చేసుకోవాలని కోరింది. 

సతీష్‌ తనకు అప్పటికే వివాహం జరిగిందని చెప్పాడు. మొత్తం విచారించానని, మీకు వివాహం జరిగి విడాకులు కూడా తీసుకున్నట్లు తెలిసిందని, తనకు అభ్యంతరం లేదంటూ సతీష్‌ను ఒత్తిడి చేసింది. చివరకు పెద్దల సమక్షంలో ఓ దేవాలయంలో మే 13న జయశ్రీపాండాను సతీష్‌ వివాహం చేసుకున్నాడు.  జూన్‌ 13న ఇంట్లో ఉన్న సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు    నగదును తీసుకుని వెళ్లిపోయింది. బంగారం, నగదు గురించి సతీష్‌ అడగ్గా తానే తీసుకువెళ్లానని, తన అత్తయ్య వద్ద ఉంచానని చెప్పింది.

 వెంటనే ఫోన్‌ చేసి తన అన్నయ్య బంగారం, నగదు తీసుకువెళ్లినట్లు సతీష్‌కు చెప్పింది. పలాసకు వచ్చి నగదు రూపంలో సెటిల్‌మెంట్‌ చేసుకుని పెద్దల సమక్షంలో విడాకుల పత్రాలు రాసుకుందామంటూ సతీష్‌ను రమ్మంది. అంగీకరించకపోతే తప్పుడు కేసులు పెడతానని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని సతీష్‌ తన ఫిర్యాదులో తెలిపాడు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తీసుకువెళ్లిన నగదు, బంగారు ఆభరణాలను ఇప్పించి తనను నమ్మించి మోసం చేసిన జయశ్రీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సతీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement