పేరు గంటా రాముడు.. ఎక్స్ఎల్ బైక్ కనపడితే ఖతం.. అన్నింటినీ ఇంట్లో పెట్టి!

Police Arrested Bike Thief In Kurnool District - Sakshi

కర్నూలు (బొమ్మలసత్రం) : కేవలం టీవీఎస్‌ కంపెనీకి చెందిన ఎక్స్‌ఎల్‌ బైక్‌లను మాత్రమే కాజేసే ఓ దొంగను వన్‌టౌన్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. మరే ఇతర బైకు కనిపించినా ఈ దొంగ వాటి వైపు కన్నెత్తి చూడడు. ఎందుకంటే ఆ దొంగకు కేవలం టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనాన్ని మాత్రమే నడుపుతాడు. సరే దొంగిలించిన వాహనాన్ని ఎవరికైనా తక్కువ ధర విక్రయిస్తాడా అంటే అదీ లేదు. తాను దొంగిలించిన 14 బైకులను ఒక ఇంట్లో ఉంచి వాటిని చూస్తూ ఆనందించేవాడు. వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన 54 ఏళ్ల గంటా రాముడు చిన్నతనం నుంచి జులాయిగా తిరిగేవాడు. రాముడు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ బైక్‌ మాత్రమే నడిపేవాడు. 

ఎక్కడ టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ బైకు కనిపించినా తన దృష్టి బైక్‌మీదే ఉంచేవాడు. తన ఇంటి నిండా టీవీఎస్‌ బైకులతో నింపాలన్న చిలిపి కోరిక రాముడు దొంగతనాలకు బానిసయ్యేలా చేసింది. ఈ క్రమంలో నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు, నందికొట్కూరు ప్రాంతాల్లో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. రద్దీగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని తనకు నచ్చిన బైకు వద్ద వెళ్లి, ఎవరూ లేని సమయంలో దాన్ని దొంగిలించి వాహనంపై పరారయ్యేవాడు. ఇదే క్రమంలో నంద్యాల గాంధీచౌక్‌ సెంటర్‌లో ఒక దుకాణం ముందు నిలిపిన బైకును రాముడు గత నెలలో చోరీ చేశాడు. 

బాధితుని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో రాముడు బైక్‌ ఎత్తుకెళ్లిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. రాముడు సొంత గ్రామమైన కొణిదెల గ్రామానికి వెళ్లి విచారించారు. తాను ఏకంగా 14 బైకులు దొంగిలించినట్లు ఒప్పుకుని వాటిని ఓ పాడుబడిన మిద్దెలో దాచినట్లు చెప్పాడు. పోలీసులు బైక్‌లను స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా దర్యాప్తు చేసి దొంగను పట్టుకున్న ఏఎస్సై క్రిష్ణారెడ్డి, హుస్సేన్‌ సిబ్బంది మద్దిలేటి, మస్తాన్, సుధాకర్‌లను డీఎస్పీ రామాంజినాయక్, సీఐ ఓబులేసులు అభినందించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top