పంటలకు పోల‘వరం’..8500 ఎకరాల సాగుకు అండ

Polavaram Project Left Canal Irrigating Crops In Construction Phase - Sakshi

సాగునీటి వనరుగా మారిన కాలువ

నిర్మాణ దశలోనే అందుతున్న నీరు 

8500 ఎకరాల సాగుకు అండ 

పిఠాపురం: పోలవరంలోనే ఉంది వరం. నిర్మాణ దశలోనే రైతులకు వరంగా మారింది.  వర్షాధారంతోనే సాగయ్యే మెట్ట భూములకు పనులు పూర్తి కాకుండానే సాగునీరందిస్తోంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ 80 శాతం పనులు పూర్తి కాగా ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో పోలవరం కాలువ వేల ఎకరాలలో పంటలకు నీరందించి సిరులు కురిపిస్తోంది. కాలువ తవ్విన ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలకళ ఉట్టిపడుతోంది. ఎక్కడ చూసినా కాలువ నిండా నీటి నిల్వలు ఉండడంతో సమీప పొలాలకు రైతులుమోటార్ల ద్వారా నీటిని తోడి సాగు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పోలవరం కాలువపై ఆధార పడి జిల్లాలో సుమారు 2580 ఎకరాల వరకూ మెట్ట భూముల్లో 2300 ఎకరాల వరకు వరి సాగు చేస్తున్నారు. అపరాల నుంచి వరి వరకు పోలవరం కాలువపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఇంకా ప్రారంభం కాకుండానే రైతులకు ఉపయోగపడుతున్న ఈ కాలువ పనులు పూర్తయితే వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయి.  

రబీకి అండగా.. 
వర్షాకాలంలో కాలువ నిండుగా మారి ఎద్దడి సమయంలో సాగు చేసే రబీ పంటకు నీరందిస్తోంది.  జగ్గంపేట, ప్రత్తిపాడు, కిర్లంపూడి, పెద్దాపురం, తొండంగి, గొల్లప్రోలు తదితర మండాలల్లో ఎక్కువగా పంట పొలాలకు రబీ సీజన్‌లో నీటి ఎద్దడి ఎదురవుతుంది. అలాంటి సమయంలో కాలువ చివరి భూములకు, మెట్ట భూములకు ప్రస్తుతం పోలవరం కాలువే నీటి వనరుగా మారిపోయింది. కాలవకు ఆనుకుని కిలో మీటరు దూరంలో ఉన్న అన్ని భూములకూ రైతులు ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకుంటున్నారు. సాగు చేసుకుంటున్నారు.  వర్షాల కోసం ఎదురు చూడకుండా కాలువలోని నీటి సహాయంతో ముందుగా నారు మళ్లు వేసుకుంటున్నారు. నీటి ఎద్దడి ఎదురైతే వెంటనే ఇంజిన్ల సహాయంతో నీటిని తోడి పంట ఎండిపోకుండా కాపాడుకుంటున్నారు.  కాలువు సమీపంలోని రైతులు ఇంజిన్లతో నీటిని తోడుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ఎక్కువ మంది కలిసి నిధులు సమకూర్చుకుని పెద్ద ఇంజిన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.  

పోలవరం కాలువే కాపాడుతోంది 
నేను ఎనిమిదెకరాలు సాగు చేస్తున్నాను. కాలువ తవ్వక ముందు నీటి ఎద్దడి వస్తే పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాలు వచ్చేవి.  ఎనిమిదేళ్లుగా పోలవరం కాలువ  అండగా నిలిచింది. ఖరీఫ్‌ నుంచి రబీ, అపరాల సాగు వరకు నీటి ఎద్దడి ఎదురైనా ఇబ్బంది లేకుండా ఉంటోంది. పక్కనే కాలువ నిండా ఎప్పుడు నీరు ఉంటుండడంతో మాకు భయం లేకుండా పోయింది. ఒక వేళ నీటి ఎద్దడి వస్తే ఇంజన్లతో నీరు తోడుకుని సాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నాం. 
– కోరుమిల్లి నూకరాజు, కౌలు రైతు, చెందుర్తి, గొల్లప్రోలు మండలం. 

కాలువ లేనప్పుడు కష్టాలు పడ్డాం 
కాలువ లేని సమయంలో చాలా కష్టాలు పడ్డాం. పంట వేయడమే గగనంగా ఉండేది.  నీరందక పంటలు ఎండిపోయేవి. ఎక్కువగా బోర్లపై ఆధారపడే వాళ్లం. అదీ కొందరికే అవకాశం ఉండేది. కౌలు రైతులయితే ఒక పక్క పంటలు పోవడం వల్ల అటు కౌలు, ఇటు  పెట్టుబడి నష్ట పోయేవారు. ఇప్పుడు పోలవరం కాలువ కొండంత అండగా నిలిచింది. ఎప్పుడు కావాలన్నా అప్పుడు పంటలు వేసుకుంటున్నాం. . 
– వాసంశెట్టి శ్రీనివాస్, కౌలు రైతు చెందుర్తి, గొల్లప్రోలు మండలం. 

పోలవరం కాలువ రైతులకు వరమే 
బోర్లతో పని లేకుండా కాలువ నీటితో సాగు చేసుకుంటున్నారు. కొంత పెట్టుబడి అయినా పంట నష్ట పోకుండా కాపాడుకోగలుగుతున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గతంలో అపరాల సాగు అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు సాగు పెరిగింది. రైతులు ధైర్యంగా  సాగు చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి వల్ల పంటలు పోయాయనే మాట వినపడటంలేదు. 
– సత్యనారాయణ, వ్యవసాయశాఖాధికారి. గొల్లప్రోలు.

ఇదీ చదవండి: రీసర్వేలో మరో మైలురాయి.. 8 లక్షలకుపైగా ఎకరాలకు సరిహద్దుల నిర్ణయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top