రీసర్వేలో మరో మైలురాయి.. వెయ్యి గ్రామాల్లో భూములకు హద్దులు | Sakshi
Sakshi News home page

రీసర్వేలో మరో మైలురాయి.. 8 లక్షలకుపైగా ఎకరాలకు సరిహద్దుల నిర్ణయం

Published Thu, Aug 18 2022 8:35 AM

Another Milestone In Jagananna Bhu Hakku Bhu Raksha Scheme - Sakshi

సాక్షి, అమరావతి: భూముల రికార్డులను ప్రక్షాళన చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో చేపట్టిన జగనన్న భూహక్కు భూరక్ష పథకంలో ప్రభుత్వం మరో మైలురాయి అధిగమించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారానికి 1,000 గ్రామాల్లో రీసర్వే విజయవంతంగా ముగించి.. దీనికి సంబంధించిన నంబర్‌ 13 ముసాయిదా నోటిఫికేషన్లను జారీ చేశారు. ఈ గ్రామాల్లో 8 లక్షల 509 ఎకరాలను రీసర్వేలో కొలిచి కొత్త సరిహద్దులు నిర్ణయించారు. సర్వే ఆఫ్‌ ఇండియా, ప్రైవేట్‌ ఏజెన్సీలు డ్రోన్‌ సర్వే చేసి ఇచ్చిన చిత్రాలు (ఓఆర్‌ఐ), భూ యజమానులు వాస్తవంగా చూపించిన సరిహద్దులను పోల్చి కొలతలు వేశారు. తొలుత ఆ గ్రామాల సరిహద్దులు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములను సర్వే చేశారు. ఆ తర్వాత పట్టా భూముల సర్వే పూర్తి చేశారు. కొత్తగా వచ్చిన కొలతలపై అభ్యంతరాలు వచ్చినప్పుడు జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్లతో మళ్లీ సర్వే చేశారు. రైతుల ఆమోదంతో సరిహద్దులు నిర్ధారణ పూర్తయ్యాక పాత భూముల రికార్డుల స్థానంలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేని విధంగా కొత్త భూముల రికార్డులు తయారవుతున్నాయి.

అత్యధికం శ్రీకాకుళం.. అత్యల్పం అల్లూరి జిల్లా
జిల్లాల వారీగా గ్రామాలను చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 193 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో 89, వైఎస్సార్‌ జిల్లాలో 72, నెల్లూరు జిల్లాలో 67, తిరుపతి జిల్లాలో 62 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. విస్తీర్ణ పరంగా చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,04,018 ఎకరాలను (58 గ్రామాలు) కొలిచి సర్వే పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో 89,475 ఎకరాలు (28 గ్రామాలు), నెల్లూరు జిల్లాలో 78,102 ఎకరాలు (67 గ్రామాలు) కొలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా 2 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. గుంటూరు జిల్లాలో 5 గ్రామాల్లోనే సర్వే పూర్తయింది. 

ఆ గ్రామాల్లో డిజిటలైజ్డ్‌ రెవెన్యూ రికార్డులు
రీసర్వే పూర్తయిన గ్రామాల్లో డిజిటలైజ్డ్‌ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 90 శాతం గ్రామాల్లో కొత్త రికార్డులు తయారయ్యాయి. ఎఫ్‌ఎంబీ (ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌) స్థానంలో ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం– భూకమతాల మ్యాప్‌), ఆర్‌ఎస్‌ఆర్‌ స్థానంలో రీసర్వే ల్యాండ్‌ రిజిస్టర్, కొత్త 1బి రిజిస్టర్, అడంగల్‌ రిజిస్టర్, రెవెన్యూ గ్రామ మ్యాప్‌లు రూపొందాయి. కొత్త హద్దులు, తాజా భూయజమానుల వివరాలతో ఈ రికార్డులు రూపొందాయి. రీసర్వే పూర్తయిన కొత్త భూముల రికార్డులు అందుబాటులోకి వచ్చిన గ్రామాల్లో ఇకపై ఎలాంటి భూసంబంధిత పనులకైనా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. భూ యజమానులు ఎక్కడ నుంచైనా రికార్డులను సరిచూసుకోవచ్చు. భూ యజమాని అనుమతి లేకుండా, అతనికి తెలియకుండా భూమి రికార్డులలో ఎలాంటి మార్పు చేయలేని విధంగా భూ సమాచార వ్యవస్థను రీసర్వే ద్వారా తయారు చేస్తున్నారు.

రీసర్వే వేగంగా జరుగుతోంది
రాష్ట్రంలో భూముల రీసర్వే వేగం పుంజుకుంది. సర్వే అండ్‌ బౌండరీ చట్టం ప్రకారం వెయ్యి గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. మొదటి దశలో 5,300 గ్రామాలకు 4,600 గ్రామాల్లో రీసర్వేలో మొదట చేపట్టే డ్రోన్‌ ఫ్లైయింగ్‌ (డ్రోన్లతో కొలత) పూర్తయింది. సెప్టెంబర్‌ నాటికి మొదటి దశ అన్ని గ్రామాల్లో డ్రోన్‌ ఫ్లైయింగ్‌ పూర్తవుతుంది. వర్షాలు తగ్గాక ఇంకా వేగంగా సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.
    – సిద్ధార్థ్‌ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ
 

ఇదీ చదవండి: YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement