నేడు మంగళగిరి ఎయిమ్స్‌ జాతికి అంకితం 

PM Narendra Modi will dedicate AIIMS Mangalagiri on February 25 - Sakshi

మైక్రోబయాలజీ, మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ల ప్రారంభం   

రూ.233 కోట్లతో 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లకూ శంకుస్థాపన 

వర్చువల్‌గా కార్యక్రమాలను నిర్వహించనున్న ప్రధాని మోదీ   

సాక్షి, అమరావతి: మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్‌(ఎయిమ్స్‌)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్‌­ని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌తో పాటు రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభిస్తారు.

అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌లో భాగంగా రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. వీటిలో ప్రధానంగా వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లా­ల్లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో రూ.23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్‌ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాకుల్ని నిర్మించనున్నారు.   

ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోండి
స్పెషల్‌ సీఎస్‌ ఎంటీ కృష్ణబాబు  
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎంటీ కృష్ణబాబు ఎయిమ్స్‌ పరిపాలన భవన్‌లో శనివారం అధికారులతో సమీక్షించారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, డాక్టర్‌ భారతీప్రవీణ్‌ పవార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పాల్గొంటారని, ఎక్కడా ఎలాంటి లోటు­పాట్లు రాకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని కృష్ణబాబు సూచించారు.

అనంతరం ఎయిమ్స్‌ ప్రాంగణంలోని సభా వేదికను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్షలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ జె నివాస్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ (ట్రైనింగ్‌–నేకో) నిధి కేసర్వాని, ఎయిమ్స్‌ డైరెక్టర్, సీఈవో డాక్టర్‌ మధబానందకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top