భారీ వర్షాలు : ఉద్యోగులకు సెలవులు రద్దు

Panchayati Raj Commissioner Girija Shankar Teleconference On Rains  - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని భారీ వర్షాలపై పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని జిల్లాల డీపీవోలు, పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో దీనిపై సమీక్షించారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, ఉద్యోగులందరికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో మంచి నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని గిరిజా శంకర్‌ ఆదేశించారు. వర్షాల కారణంగా పేరుకుపోయిన డ్రైన్‌ను శుభ్ర పరచాలని సూచించారు. అన్ని గ్రామాల్లోనూ క్లోరినషన్ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిరంతరం వర్షాల పరిస్థితులు సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గిరిజా శంకర్ వెల్లడించారు. 

ఇక కాకినాడ సమీపాన వాయుగుండం తీరాన్ని తాకింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా  వర్షాలు పడనున్నాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

దీనిపై ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ, ఇది డీప్ డిప్రెషన్ మాత్రమేనని, తుఫానులా మారలేదని చెప్పారు. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం కాకినాడ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, రాగల మూడు నాలుగు గంటలు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరుల మీదుగా వర్షాలు తెలంగాణా వైపు వెళతాయన్నారు. ప్రస్తుతం గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల మేర గాలులు వీస్తున్నాయన్నారు. 

తీర ప్రాంతంలో 60 నుంచి 65 కిలో మీటర్ల వేగం ఉండొచ్చు అని  తెలిపారు. అన్ని జిల్లాల్లో సహాయకచర్యలు అందించడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మంగళగిరిలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సర్వం సిద్ధం చేసుకొని ఉన్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితమే కాకినాడకు ఒక ప్లటూన్ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపామని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నానానికి ఏపీలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.  చదవండి: భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top