కాంట్రాక్టులన్నీ స్వీప్‌! | Only one person can manage sweeping missions in municipalities: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టులన్నీ స్వీప్‌!

Jul 4 2025 4:27 AM | Updated on Jul 4 2025 4:28 AM

Only one person can manage sweeping missions in municipalities: Andhra Pradesh

మున్సిపాల్టీల్లో స్వీపింగ్‌ మిషన్ల నిర్వహణ ఒక్కరికే

మంత్రి పేరుతో ఎక్కడికక్కడ టీడీపీ నేతలతో మిలాఖత్‌

ఇప్పటికే సరఫరా చేసిన శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్‌ప్రైజెస్‌ పేరుమీదే అధిక వాహనాలు

సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టిన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌

తాజాగా.. ఓ అండ్‌ ఎం పేరుతో మరోసారి ఈ సంస్థకే కాంట్రాక్టుల అప్పగింతకు రంగం సిద్ధం

ఇప్పటికే గుంటూరులో డీల్‌ ఓకే.. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ అదే తంతు

టీడీపీ గత పాలనలో కొనుగోలు చేసిన మూణ్ణాళ్లకే వాహనాలు మూలకు..

ఈ ఫొటోలో ఉన్న స్వీపింగ్‌ యంత్రాలు నెల్లూరు మున్సిపాలిటీలోనివి. గతంలో టీడీపీ పాలనలో సరఫరా చేసిన ఏడేళ్లకే ఈ వాహనాలు మూలకు చేరాయి. వాస్తవానికి.. వాహనాల కాలపరిమితి రవాణాశాఖ లెక్క ప్రకారం 15 ఏళ్లు. అయితే, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేసిన ఈ వాహనాలు మూణ్ణాలకే మూలకు చేరాయి.

ఏపీ27టీజెడ్‌ 2131 రిజిస్ట్రేషన్‌ నెంబరు కలిగిన ఈ స్వీపింగ్‌ యంత్రాన్ని నెల్లూరు మున్సిపాలిటీకి 2017లో సరఫరా చేశారు. అయితే, ఇది కాస్తా 2018లో మరమ్మతులకు గురికావడంతో అప్పటి నుంచి ఈ స్వీపింగ్‌ యంత్రం శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ గోడౌన్‌లోనే మూలుగుతోంది.  దీనిపై నెల్లూరు మున్సిపల్‌ అధికారులు అడిగేందుకూ సాహసించడంలేదు. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

ఇప్పుడీ స్వీపింగ్‌ యంత్రాల నిర్వహణ, మరమ్మతు (ఓ అండ్‌ ఎం) పేరుతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంట్రాక్టులన్నీ ఈ సంస్థకే అప్పగించేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. మంత్రి పేరుతో అన్ని మున్సిపాలిటీల్లోని అధికారులు, టీడీపీ కూటమి నేతలను ఈ సంస్థ ప్రతినిధులు కలుస్తూ తమకే కాంట్రాక్టు వచ్చేలా నిబంధనలు రూపొందించుకుంటున్నారనే విమర్శలు­న్నాయి. వాస్తవానికి.. సదరు సంస్థ సరఫరా చేసిన 125 వాహనాల్లో ఇప్పటికీ 61 వాహనాలు మున్సిపాలిటీల పేరిట ఇంకా రిజిస్ట్రేషన్‌ కూడా కాలేదు.

అయినప్పటికీ సదరు సంస్థ యంత్రాల కొనుగోలు సమయంలో టెండరు దాఖలు చేసినప్పుడు ఉంచిన ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ) కూడా చెల్లించేందుకు ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి. మరోవైపు.. సదరు సంస్థ సరిగ్గా వాహనాలను నిర్వహించడంలేదని.. వాటికి మరమ్మతులు చేయడంలేదని పేర్కొంటూ విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ సంస్థను 2023లో టెర్మినేట్‌ చేసింది. సాధారణంగా టర్మినెట్‌ చేసిన సంస్థకు పనులు అప్పగించకూడదు. కానీ,  గుంటూరులో శ్రీ రా­జరాజేశ్వరి ఎంటర్ర్‌పైజెస్‌ దాఖలు చేసిన సింగిల్‌ టెండర్‌కే పనులు అప్పగించగా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఓ మంత్రి పేరుతో ఓ అండ్‌ ఎం కాంట్రాక్టులను  ఊడ్చేసేందుకు రంగం సిద్ధమైంది.

రిజిస్ట్రేషన్‌ చేయకుండానే..
వాస్తవానికి.. రూ.41 కోట్లు వెచ్చించి 125 స్వీపింగు వాహనాలను శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ ద్వారా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ 2017లో కొనుగోలు చేసింది. ఈ వాహనాలను రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు ఆ సంస్థ సరఫరా చేసింది. అయితే, ఇందులో 62 వాహనాలకు ఇప్పటివరకు ఆయా మున్సిపాలిటీల పేరిట రిజిస్ట్రేషన్లు కాలేదు. అయినప్పటికీ ఆ సంస్థకు అప్పట్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ బిల్లులు చెల్లించింది. అయితే, ఈ వాహనాలను ఆయా మున్సిపాలిటీలు సొంత నిధులతో రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ముందుకొస్తే.. చేయిస్తానని సదరు సంస్థ ఇప్పుడు చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు కూడా సంసిద్ధత తెలిపి.. ఆ భారాన్ని మున్సిపాలిటీలపై వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, మొత్తం 125 వాహనాల్లో సగానికి పైగా వాహనాలకు ఇంజన్లు లేవు. వీటిని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రవాణా శాఖాధికారులు అంగీకరించే అవకాశంలేదని మున్సి­పల్‌ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఇక నెల్లూరు మున్సిపాలిటీలో ఇప్పటికే రూ.8 కోట్లతో టీపీఎస్‌ సంస్థ ద్వారా ఐదు కొత్త స్వీపింగ్‌ యంత్రాలు కొనుగోలు చేశారు.

వీటికి రానున్న ఐదేళ్ల పాటు రాజరాజేశ్వరి సంస్థకు ఓ అండ్‌ ఎం బాధ్యతలను సింగిల్‌ టెండర్‌లో అప్పగించడం గమనార్హం. ఇదే తరహాలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు తదితర మున్సిపాలిటీల్లో కూడా కొత్త స్వీపింగ్‌ యంత్రాల నిర్వహణ, మరమ్మతు పనులను మళ్లీ ఈ సంస్థకే అప్పగించేందుకు అధికారులను మంత్రి పేరుతో ఒత్తిళ్లు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకదాని పరికరాలు మరో దానికి..
ఇక సాధారణంగా ఏదైనా వాహనంలో ఒక పరికరం పాడైతే మరో పరికరాన్ని అమర్చి బాగుచేయాల్సి ఉంటుంది. కానీ, ఒక వాహనానికి చెందిన పరికరాన్ని మరో­దానికి అమర్చడం పరిపాటిగా మారింది. ఇలా మొత్తం వాహనాలను డొల్లకింద మార్చేశారు. ఫలితంగా.. అనేక వాహనాల్లో ఏకంగా ఇంజిన్లు, బ్లోయర్లు, రేడియేటర్లు వంటి ముఖ్యమైన పరికరాలు మాయమై మూలకు చే­రా­యి.

తిరుపతి, నెల్లూరు, గుంటూరులో మాత్రం ఆయా మున్సిపాలిటీలు సొంత నిధులతో మరమ్మతులు చేయించి తిప్పుకుంటున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు మరో­సారి రానున్న ఐదేళ్లపాటు కూడా ఇదే సంస్థకు ఓ అండ్‌ ఎం అప్పగించేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ఇప్పటికే గుంటూరు మున్సిపాలిటీలో సింగిల్‌ టెండర్‌ ద్వారా శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించగా.. తిరుపతి, విశాఖ, కర్నూలు, నెల్లూరులోనూ ఇదే తరహా మంత్రాంగం నడుస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement